శివకు ‘రాజ్యసభ’ దక్కేనా?
Published Sun, Jan 19 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
సాక్షి, చెన్నై : డీఎంకే అభ్యర్థిగా రాజ్యసభలో తిరుచ్చి శివకు మళ్లీ అడుగు పెట్టేనా అన్న చర్చ బయలు దేరింది. కరుణానిధి ఆశీస్సులతో తన గెలుపు తథ్యమని శివ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయ వర్గాలు మాత్రం ఓట్ల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్య సభ ఎంపీల పదవీ కాలం త్వరలో ముగియనున్నది. ఈ స్థానాల భర్తీ నిమిత్తం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థిగా తిరుచ్చి శివను రేసులో దింపుతూ డీఎంకే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇది వరకు రాజ్యసభ సభ్యుడిగా తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకున్న శివకు ఈ పర్యాయం విజయావకాశాలు ఎలా ఉంటుందోనన్న చర్చ బయలు దేరింది. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో కనిమొళి గట్టెక్కగా, తాజాగా శివకు మద్దతు ఇచ్చే వాళ్లెవరోనన్న ప్రశ్న బయలు దేరింది.
చర్చ : ఇది వరకు కాంగ్రెస్‌తో కలసి ఉన్న దృష్ట్యా, డీఎంకేకు అదనంగా ఐదు ఓట్లు వచ్చి చేరాయి. దీంతో కనిమొళి రాజ్య సభ మెట్లు ఎక్కగలిగారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో మళ్లీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు డీఎంకే నిర్ణయించింది. తిరుచ్చి శివకు మళ్లీ అవకాశం కల్పించారు. డీఎంకే వద్ద 23 ఓట్లు ఉండగా, ఆ పార్టీకి పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చిలు మద్దతు ప్రకటించారుు. ఆ రెండు పార్టీలకు చెరో రెండు ఓట్లు ఉండటంతో సంఖ్య 27కు చేరింది. అయితే, పుదియ తమిళగంలో ఒక ఓటు డీఎంకేకు పడేనా అన్నది అనుమానమే. ఇందుకు కారణం ఆపార్టీ నేత కృష్ణస్వామిపై ఎమ్మెల్యే రామస్వామి తిరుగు బావుటా ఎగర వేయడమే. ఈ దృష్ట్యా సంఖ్య 26కు తగ్గనున్నది. ఒక ఎంపీ గెలవాలంటే 34 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ దృష్ట్యా, అదనంగా ఎనిమిది ఓట్లు శివకు ఎక్కడి నుంచి వచ్చి పడేనో అన్న ప్రశ్న నెలకొంది. కాంగ్రెస్‌ను డీఎంకే దూరం పెట్టిన దృష్ట్యా, వారి మద్దతు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. అదే సమయంలో తమ అభ్యర్థిని నిలబెట్టకుండా డీఎంకేకు డీఎండీకే మద్దతు ఇచ్చిన పక్షంలో శివ గట్టేక్కే అవకాశం ఉంది. ఇందుకు డీఎండీకేలో ఆస్కారం ఉందా..? అన్నది సందిగ్ధమే. ఈ దృష్ట్యా, శివ గెలుపునకు కరుణానిధి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించనున్నారో, ఇది లోక్ సభ ఎన్నికల రాజకీయానికి వేదిక అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే.
కరుణ ఆశీస్సు : తనను అభ్యర్థిగా ప్రకటించడంతో చెన్నైకు తిరుచ్చి శివ ఉరకలు తీశారు. ఉదయాన్నే అధినేత ఎం కరుణానిధిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గెలుపు ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి ఆశీస్సులు తనను తప్పకుండా గెలిపిస్తాయని శివ ఆశాభావం వ్యక్తం చేశారు. 21వ తేదీ తాను నామినేషన్ వేయనున్నానని, తన గెలు పు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా..? అని ప్రశ్నిం చగా, తమ అధినేత తీసుకునే నిర్ణయాలు తనను గెలిపిస్తాయని పేర్కొడం విశేషం.
కమిటీ: ఫిబ్రవరి 15,16 తేదీల్లో తిరుచ్చి వేదికగా డీఎంకే మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆహ్వాన, పందిళ్లు, వేదిక, ప్రచార కమిటీలు నియమిస్తూ డీఎంకే అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇందులో పెరంబలూరు, పుదుకోట్టై, తిరుచ్చి జిల్లాల నాయకులకు అవకాశం కల్పించారు. వేదికను ఢిల్లీలోని ఎర్రకోట తరహాలో తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు.
Advertisement
Advertisement