నామినేషన్ల పర్వం ప్రారంభం
Published Wed, Jan 22 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మంగళవారం ప్రారంభమైంది. డీఎంకే అభ్యర్థి తిరుచ్చీ శివ తన నామినేషన్‌తో బోణీ చేశారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఆ పార్టీ ఎంపీలు టీఆర్ బాలు, టీకేఎస్ ఇళంగోవన్ పలువురు ఎమ్మెల్యేలు వెంటరాగా ఉదయం 11.40 గంటలకు సచివాలయం చేరుకున్న శివ అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. కేంద్రమంత్రి జీకే వాసన్, మాజీ కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్, డీఎంకేకు చెందిన అమర ఆలీ జిన్నా, వసంతీ స్టాన్లీ, అన్నాడీఎంకేకు చెందిన టీకే రంగరాజన్, బాలగంగా రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 2వ తేదీతో ముగిసిపోతోంది. దీంతో ఈ ఆరు స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. పార్టీ బలా బలాలతో నిమిత్తం లేకుండా ఎవరికి వారు పోటీపడుతున్నారు.
గత ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేని డీఎంకే తన అభ్యర్థి కనిమొళి గెలుపుకోసం కాంగ్రెస్ సాయం తీసుకుంది. యూపీఏ నుంచి వైదొలగినా కనిమొళి కోసం కాంగ్రెస్ ఓట్లను కోరక తప్పలేదు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రశ్నేలేదని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థి శివ గెలుపు ఎలా సాధ్యమనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ వేసిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, శివ గెలుపునకు అవసరమైన ఓట్లు తమ వద్ద ఉన్నాయని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు. కొడనాడుకు వెళ్లి జయతో వారు చర్చలు జరిపారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేయడం ద్వారా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాలని ఆరాటపడుతున్న పద్మరాజన్ సైతం నామినేషన్ వేశారు. ఇది ఆయన వేసిన 157వ నామినేషన్. వీరవన్నియ మక్కల్ సంఘం నేత శ్రీరామచంద్రన్ కూడా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ నెల 28వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 29న పరిశీలన, 31వ తేదీన ఉపసంహరణ పూర్తి చేస్తారు. అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కాకుంటే వచ్చేనెల 7న పోలింగ్ జరుపుతారు.
Advertisement
Advertisement