
రణరంగం
రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ వేదికగా శనివారం సాగిన సమరం రణరంగాన్ని తలపించింది. కనీవిని ఎరుగని రీతిలో సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు.
రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ వేదికగా శనివారం సాగిన సమరం రణరంగాన్ని తలపించింది. కనీవిని ఎరుగని రీతిలో సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు రాష్ట్ర ప్రజల చూపు అసెంబ్లీ వైపు నుంచి వెలువడే తీర్పు మీద పడింది. అందరూ టీవీలకు అతుక్కు పోయారు. చివరకు ప్రధాన ప్రతి పక్షం గెంటి వేత, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాకౌట్‌తో సభలో ప్రతి పక్షం అన్నది లేకుండా బలనిరూపణ సాగించి చిన్నమ్మ సేనలు విజయకేతనం ఎగుర వేశారు.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సమరంలో క్లైమాక్స్ ఊహించని మలుపుతో రణరంగానికి దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిల మధ్య సాగాల్సిన క్లైమాక్స్‌లో డీఎంకే పాత్ర సభలో ఉత్కంఠను రేపింది. డీఎంకే అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపు లు బయలు దేరిన నేపథ్యంలో బలమైన ప్రధాన ప్రతి పక్షంగా అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు డీఎంకే సభ్యులు తీవ్రంగానే దూకుడు ప్రదర్శించారు. సభ ప్రారంభం మొదలు, బలపరీక్షకు సిద్ధ పడ్డ పళని స్వామిని ఇరకాటంలో పడేస్తూ , స్పీకర్ ధనపాల్ మీద ఒత్తిడి తెచ్చే రీతిలో డిఎంకే అడుగులు సాగాయి.
ఉద్రిక్తల నడుమ : రహస్య ఓటింగ్‌కు పట్టుబడుతూ, స్పీకర్ మీద డిఎంకే ఒత్తిడి మరీ ఎక్కువ కావడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. ఇక, వాయిదాల పర్వానికి ముందుగా సభలో చోటు చేసుకున్న ఉద్రిక్తత కిష్కింద కాండను తలపించాయి. ఉదయం పద కొండు గంటల నుంచి రాష్ట్ర ప్రజానీకం చూపు అసెంబ్లీ వైపుగా మరలించింది. బలపరీక్షలో వెలువడే తీర్పు ఎలా ఉండబోతుందో అన్న ఎదురు చూపులతో టీవీలకు అతుక్కు పోయారు. చివరకు మూడు గంటల సమయంలో సభ మళ్లీ ప్రారంభం కాగానే, ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ ప్రతిపక్షం అన్నది సభలో లేకుండా చేసి, చిన్నమ్మ శపథం నెగ్గే రీతిలో, అమ్మ జయలలిత భజన సాగిస్తూ స్పీకర్ ధనపాల్ ప్రసంగం సాగడం గమనార్హం. ముందుగా, నాలుగు డివిజన్లుగా ఓటింగ్ అంటూ, పళని మద్దతు దారుల్ని పైకి లేచి నిలబడేలా చేసి క్షణాల్లో బల పరీక్షను స్పీకర్ ముగించారు.
పన్నీరుకు నిరాశే : ఓటింగ్‌లో ఎమ్మెల్యేలు తనను ఆదరిస్తారన్న ఆశతో ఉన్న పన్నీరు సెల్వంకు నిరాశే మిగిలింది. శనివారం ఉదయాన్నే కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్ కుమార్ శిబిరం నుంచి బయటకు రావడంతో, ఇక, మద్దతు సంఖ్య పెరుగుతుందన్న ఆనందం పన్నీరు శిబిరంలో నెలకొంది. అయితే, ఏ ఒక్క ఎమ్మెల్యే పన్నీరు వైపుగా కన్నెత్తి చూడక పోవడంతో చివరకు ఆ శిబిరానికి మిగిలింది కన్నీరే. ధర్మయుద్ధం ఆరంభం అయిందని, ప్రజలతో కలిసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆవేదనను దిగమింగుకుంటూ పన్నీరు ప్రకటించారు.
చొక్కా చిరగడంతో ఉత్కంఠ : అసెంబ్లీ సమావేశ మందిరం నుంచి పదుల సంఖ్యలో మార్షల్స్ స్టాలిన్‌ను తీసుకొచ్చి బయట పడేయడం, చిరిగిన చొక్కాతో ఆయన బయటకు రావడం వెరసి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపింది. ఎక్కడికక్కడ డిఎంకే వర్గాలు ఆందోళనలకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పేనా అన్న ఆందోళన బయలుదేరింది. రాజ్ భవన్‌లో గవర్నర్ విద్యా సాగర్‌రావుతో భేటీ అనంతరం మెరీనా తీరంలో గాంధి విగ్రహం వద్ద స్టాలిన్ బైఠాయించడంతో మరింత ఉత్కంఠను రేపింది. పరిస్థితి అదుపు తప్పడం ఖాయం అన్న సంకేతాలతో, పోలీసుల బుజ్జగింపుతో స్టాలిన్ దిగి వచ్చారు.
కనీవిని ఎరుగని భద్రత : కువత్తూరు నుంచి సచివాలయం వరకు కనీవిని ఎరుగని విధంగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి. కువత్తూరు శిబిరం నుంచి ఒక్కో మంత్రి వాహనంలో నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు చెన్నై వైపుగా కదిలారు. మార్గ మధ్యలో వీరిని ఎవరైనా అడ్డుకోవచ్చన్న అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గం వెంబడి కిలో మీటర్ల కొద్ది భద్రతను కల్పించారు. ముఫ్‌పై మంది మంత్రుల వాహనాలు ఒకటి తర్వాత మరొకటి దూసుకురావడంతో ఆ మార్గంలో ఇతర వాహనాల్ని అనుమతించ లేదు. రోడ్డు పొడవున భద్రత సాగగా, మెరీనా తీరంలో మరీ భద్రతా హడావుడి సాగింది. సభలోకి స్టాలిన్‌ను వచ్చే క్రమంలో ఆయన వాహనంతనిఖీకి పోలీసులు యత్నించడం వివాదానికి దారి తీసింది. సచివాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్క వాహనాన్ని అటు వైపుగా అనుమతించక పోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మీడియాకు సైతం ఆంక్షలు విధించడంతో పోలీసులతో తరచూ గొడవ తప్పలేదు. మెరీనా తీరం వైపుగా వాహనాలు ఆగడంతో హైకోర్టు నుంచి సెంట్రల్ వైపుగా, అన్నా సాలై వైపుగా ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనాలు చిక్కాల్సిన పరిస్థితి.