ప్రాణం విలువ తెలియదు : విజయ్‌గోయల్
Published Thu, Oct 10 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఆ తప్పును ఎంసీడీలపై వేసి తప్పుకునేందుకు ఢిల్లీ సర్కార్ ప్రయత్నిస్తుందని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. ప్రాణాల విలువ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వానికి తెలియదంటూ దుయ్యబట్టారు. బుధవారం ఉదయం 7-30 గంటలకు బారాహిందురావ్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని ఆయన సంద ర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
‘ప్రభుత్వ ప్రతిసారీ ఎంసీడీలవైపు వేలెత్తి చూపడం మానుకుని, పాత నగరం ప్రాధాన్యతను గుర్తించి పునరుద్ధరణ పనులు సకాలంలో చేపట్టపోవడంతోనే ప్రమాదం జరిగింద’ని అన్నారు. చాందినీ చౌక్ ప్రాంతంలో ఎన్నో పురాతన భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పునరాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినా ప్రభుత్వంవైపు చర్యలు శూన్యంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్-2021లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది.
దీన్ని షాహజానాబాద్ రీ-డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎస్‌ఆర్‌డీసీ) ఆధ్వర్యంలో నిధులను విడుదల చేయాల్సి ఉంది. వీటిని ఎంసీడీ పరిధిలో ఖర్చుచేసి పునరాభివృద్ధి పనులు కొనసాగించాలి. కానీ రాజకీయ కారణాలతో ఢిల్లీ సర్కార్ ఈ విషయాన్ని తొక్కిపడుతూ వస్తోందని గోయల్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ రోజు ప్రమాదానికి కారణమైందన్నారు. ఈ ప్రాంతంలో జూలై 2007,సెప్టెంబర్ 2011,ఆగస్టు 2013న ప్రమాదాలు జరిగాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పునరాభివృద్ధి పనులను వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement