మేం గెలిస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం : విజయ్ గోయల్
Published Fri, Oct 11 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రకటించారు. రాజధానిలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమం త్రి షీలాదీక్షిత్ పదేపదే ప్రచారం చేసుకుంటూ ప్రజ లను మోసగిస్తున్నారని విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు 30శాతం తగ్గిస్తాం అన్న మాటకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
గురువారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ చార్జీలు ఛత్తీస్‌గడ్,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాతో పోలిస్తే ఢిల్లీలో అనేక రెట్లు అధికంగా ఉంది. తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు.
విద్యుత్ పంపిణీ సంస్థలతో కుమ్మక్కై రెండేళ్లలోనే 72 శాతం విద్యుత్ చార్జీలు పెంచారని ఆరోపించారు. పదేళ్లలో 300 శాతం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుంటుంబాలకు సైతం వేల రూపాయల్లో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని ఆయన వివరించారు. విద్యుత్ కంపెనీల మధ్య పోటీ పెంచడంతోపాటు పారదర్శకతతో విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తాం అన్న మాటకు కట్టుకబడి ఉన్నామని, తాము గెలిస్తే ప్రజలకు విద్యుత్‌షాక్‌లు ఉండవని చలోక్తి విసిరారు.
Advertisement
Advertisement