
పూరీలో శ్రీమందిరం సింహ ద్వారం ఎదురుగా ఆందోళన చేస్తున్న ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ సభ్యులు
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ నోటి దూకుడుకు పెట్టింది పేరు. ఆయన నోట జారిన మాటలు తరచూ కలకలం రేకెత్తిస్తాయి. మనోభావాల్ని యథాతథంగా మాటల్లో వ్యక్తీకరించేందుకు మంత్రి దామోదర్ రౌత్ ఏమాత్రం సంకోచించరు. ఇదే పంథాలో బ్రాహ్మణుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ వ్యాఖ్యలకు నిరసనగా ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు నడుం బిగించింది. ఈ ఉద్యమాన్ని శ్రీ జగన్నాథుని క్షేత్రం పూరీ నుంచి ప్రారంభించారు. బ్రాహ్మణుల పట్ల మంత్రి చేసిన తేలికపాటి వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకునేంత వరకు బ్రాహ్మణ వర్గం శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఎదురుగా ముక్తి మండపం బ్రాహ్మణ మహా సభ, ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడిగా బుధవారం నిరసన ప్రదర్శించాయి. మంత్రి దిష్టి బొమ్మల్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరకుంటే ఆందోళన అంచెలంచెలుగా ఉధృతం అవుతుందని ఈ సంఘాలు స్పష్టం చేశాయి.
క్షమాపణ చెప్పేది లేదు, తప్పు చేస్తేగా: మంత్రి
బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ కూడా విజృంభించారు. వీరి డిమాండుతో క్షమాపణ చెప్పేది లేనే లేదు. తప్పు చేయని పరిస్థితుల్లో క్షమాపణ కోరడం ఎందుకని మంత్రి ఎదురు తిరిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ దుమారం వెనక బాగోతం మీడియాకు వివరించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పను. కొంత మంది స్వార్థపర రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. శ్రీ జగన్నాథుని దేవస్థానంలో భక్తులు, యాత్రికులు, పర్యాటకుల నుంచి బ్రాహ్మణులు గుంజు తున్న వ్యవహారం ఏమి టో వివరించాలని ఎదురు దాడిని మరింతగా ప్రేరేపించారు. బ్రాహ్మణులు గుంజుతున్న ఈ సొమ్ము దేవస్థానానికి చెల్లిస్తున్న సుంకమా! ప్రత్యక్షంగా చేయి చాచి అడుక్కోవడమా! అని ప్రశ్నించారు.
పూర్వాపరాలిలా ఉన్నాయి
మల్కన్‌గిరి ప్రాంతం మారుమూల దళిత ప్రభావిత గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ ప్రసంగించారు. దళితుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వృత్తిపట్ల ప్రగాఢ అంకిత భావంతో దళితులు ఎన్నడు దేనిని యాచించరు. ఆకలితో అలమటించే భయానక పరిస్థితుల్లో కొండ కోనల్లో ప్రవహించే సెలయేటి నీటి తాగుతు ప్రాణాల్ని అర్పించేందుకైనా సిద్ధం అవుతారు కాని యాచించేందుకు(భిక్షాటన) అంగీకరించరు. బ్రాహ్మణులు మాత్రం సమయానుకూలంగా దానధర్మాల ప్రేరణతో యాచిస్తారు. హిందు ఆధ్యాత్మిక భావాల నేపథ్యంలో వీరికి దానం చేసేందుకు అంతా ముందుకు వచ్చి గౌరవిస్తారు. ఈ వ్యాఖ్య బ్రాహ్మణ వర్గంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. రైతుల ఆత్మ స్థైర్యాన్ని కొనియాడుతూ బ్రాహ్మణుల యాచనని బేరీజు వేయడంతో వివాదం అలముకుంది. పంట నష్టం వగైరా సందర్భాల్లో రైతులు ఆత్మ హత్యలకు పాల్పడే సంఘటనల్ని ఆయన ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు.
రాష్ట్రంలో రైతాంగం ఆత్మ హత్యలకు పాల్పడే బలహీనులు కారు. వారి గుండెల్లో ఆత్మ స్థైర్యం నిండి ఉంది. బ్రాహ్మణుల్ని కించ పరిచే యోచన రంగు పులిమి దుమారం రేపడం విచారకరం. హిందు వర్గంలో బ్రాహ్మణులది అత్యున్నత స్థానం. వారిపట్ల ప్రతి హిందువుకు గౌరవాభిమానం ఉంటుంది. ఈ సంప్రదాయం పట్ల తనకు సానుకూలత ఉందని మంత్రి వివరించారు. కష్ట పరిస్థితుల్లో రైతు వైఖరిని విషదీకరించే క్రమంలో చోటుచేసుకున్న మాటల్లో భావాన్ని వక్రీకరించి క్షమాపణ కోరమంటే కుదరని పనిగా మంత్రి తెగేసి చెప్పేశారు. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరంలో బ్రాహ్మణులు సొమ్ము గుంజుకోవడం యాచన కాకుండే సుంకం వసూలు చేయడమా! అని మంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment