సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారు వచ్చే వారం ఈ-రేషన్ కార్డు సేవను ప్రారంభించనుంది. దీంతో ఈ సేవను ప్రారంభించిన తొలి రాష్ట్ట్రంగా ఢిల్లీ నిలవనుంది. ఈ పథకం రేషన్ కార్డుల జారీలో పారదర్శక వ్యవస్థ ప్రవేశపెట్టడమేకాక అవినీతిని అరికట్టనుంది. ఆధార్‌కార్డులు లేనివారికి కూడా ఈ రేషన్ కార్డులు జారీచేయాలని ఆహారం, పౌరసరఫరాల విభాగం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానం ద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ రేషన్ కార్డులు జారీచేసే నోడల్ అధికారులవుతారు. ఆధార్ కార్డులు కలిగినవారు తమ ఈ రేషన్ కార్డును నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ-రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఎన్‌ఎఫ్‌ఎస్.ఢిల్లీ. జీవోవీ. ఇఎన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, పోర్టల్ హోమ్‌పేజ్‌పై డేట్‌వైజ్ డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్స్ బై ఎఫ్‌ఎస్‌ఓ/ ఇన్‌స్పెక్టర్ లింక్‌పై క్లిక్ చేసి తమ దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చు. ధరఖాస్తులను పరిశీలించే ఆహారం, పౌరసరఫరాల విభాగం అధికారి, ఇన్‌స్పెక్టర్ కలిసి... దరఖాస్తుదారుడు జాతీయ ఆహార భద్రత చట్టం కింద సబ్సీడీ రేషన్‌కు అర్హుడా కాదా అన్నది నిర్ణయిస్తారు. ఆహారం, పౌరసరఫరాల విభాగం ప్రతినెలా నగరంలో 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం పంపిణీ చేస్తుంది. ఇందులో 2.40 లక్షల క్వింటాళ్ల గోధుమలున్నాయి. ఢిల్లీలో 16 నుంచి 17 లక్షల మంది జాతీయ ఆహార భద్రతా కార్డు కలిగిన వారున్నారు. 55 నుంచి 60 లక్షల మంది పేదలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఆన్‌లైన్ రేషన్ కార్డుతో పాటు ఢిల్లీ సర్కారు తాత్కాలిక చౌకధర దుకాణాలకు లెసైన్సులు కూడా జారీ చేయనుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో 2,400 చౌకధర దుకాణాలు ఉన్నాయి.
ఈ రేషన్‌కార్డు పథకాన్ని ప్రారంభించనున్న ఢిల్లీ సర్కారు
Published Sat, Mar 21 2015 11:05 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement