ఈస్టర్న్ ఫ్రీ వే రెండో టన్నెల్ ప్రారంభం
సాక్షి, ముంబై: ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం శనివారం ప్రారంభమైంది. వాహనాలు సాఫీగా, ఎలాంటి అవరోధాలు, సిగ్నల్‌లు లేకుండా గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఘాట్కోపర్ వరకు వాహనాలు చేరుకుంటున్నాయి.
ఈ ఫ్రీవే వల్ల ఠాణే, నవీముంబై నుంచి దక్షిణ ముంబైకి చాలా తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా ఆరెంజ్ గేట్, పాంజర్‌పోల్ మీదుగా ఘాట్కోపర్‌కు కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ మార్గం నుంచి ప్రతిరోజు సుమారు 25 వేలకుపైగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు.
అదే ఈస్టర్స్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాల మీదుగా వెళితే ట్రాఫిక్ కారణంగా సుమారు గంటకుపైగా సమయం పట్టేది. ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం వల్ల ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాలలో కొంత మేర ట్రాఫిక్ తగ్గనుంది. కాగా, దక్షిణ ముంబైని శివారు ప్రాంతాలతో నేరుగా కలిపేందుకు ఇప్పటికే నిర్మించిన ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ తొలి భూగర్భ సొరంగ మార్గం 2013 జూన్‌లో ప్రారంభమైంది. ఠాణే, నవీముంబై ప్రాంతాల నుంచి దక్షిణ ముంబైకి, దక్షిణ ముంబై నుంచి ఠాణే, నవీ ముంబైకి వెళ్లాలన్న ట్రాఫిక్ వల్ల చాలా సమయం తీసుకునేది. ఈ ఫ్రీవే వల్ల తక్కువ సమయంలో దక్షిణ ముంబై - ఠాణే, నవీ ముంబై ప్రాంతాలకు చేరుకునేందుకు వీలు కలిగింది. ట్రాఫిక్ సమస్య నుంచి కూడా కొంత ఊరట లభించింది.
పి.డిమెల్లో రోడ్‌పైనున్న ఆరే ంజ్ గేట్ నుంచి ఘాట్కోపర్ వరకు మొత్తం 16.4 కి.మీ. పొడవుగల ఈస్టర్న్ ఫ్రీ వే మార్గాన్ని ఎమ్మెమ్మార్డీయే మూడు విడతల్లో నిర్మించింది. ముందుగా ఆరేంజ్ గేట్ నుంచి అణిక్, అణిక్ నుంచి పాంజర్‌పోల్ వరకు 13.59 కిలోమీటర్ల మార్గంలో 9.29 కిలొమీటర్ల ఫ్లై ఓవర్ వంతెన ఉంది. ఇక పాంజర్‌పోల్ నుంచి ఘాట్కోపర్ వరకు 2.5 కి.మీ. ఫ్రీ వే పనులు కూడా పూర్తి అయ్యాయి. ఓ టన్నెల్ కారణంగా ఆలస్యమైంది. 550 మీటర్ల పొడవైన ఈ రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో శనివారం ఈ ఫ్రీవేను ప్రారంభించారు.