అసెంబ్లీలో బిల్లు ఆమోదం..
= అక్రమ సమ్మెలు చేస్తే నాన్-బెయిలబుల్ కేసు
= అత్యవసర సేవలు అడ్డుకుంటే వారెంట్ లేకుండా అరెస్ట్
= సమ్మెను ప్రోత్సహించే వారూ శిక్షార్హులే
= బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
= పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశముందంటూ విమర్శ
= సమ్మె హక్కును కాలరాసేందుకే ఈ బిల్లంటూ ధ్వజం
= వాకౌట్ చేసిన జేడీఎస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజలకు అత్యవసర సేవలను అందించే క్రమంలో భాగంగా అక్రమ సమ్మెలను నివారించడానికి ఉద్దేశించిన ‘కర్ణాటక అత్యవసర సేవల నిర్వహణ బిల్లు-2013’ (ఎస్మా)కు శాసన సభ బుధవారం ఆమోదం తెలిపింది. బెల్గాంలో శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం జేడీఎస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. ఈ బిల్లు ‘అపాయకరమైనది. పోలీసుల అధికారాలను దుర్వినియోగం చేయడానికి ఉద్దేశించినది’ అని ఆ పార్టీ విమర్శించింది.
రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి బిల్లును ప్రవేశ పెట్టారు. ఇందులోని ముఖ్యాంశాలను ఆయన వివరిస్తూ, అత్యవసర సేవలకు అడ్డు పడే ఎవరినైనా ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్టు చేయవచ్చని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నేరాలన్నీ నాన్-బెయిలబుల్ కిందకు వస్తాయని తెలిపారు. సమ్మెను ప్రోత్సహించే వారు కూడా శిక్షార్హులేనన్నారు. ఆరోపణలు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా ఉంటుందని చెప్పారు. అక్రమ సమ్మెలకు ఆర్థిక సాయం అందించడం కూడా శిక్షార్హమేనన్నారు.
అక్రమ సమ్మెలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుత రూపంలోని బిల్లును ప్రతిపక్ష నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి, జేడీఎస్ సభ్యులు ఎంటీ. కృష్ణప్ప, ఎన్. చెలువరాయ స్వామి, కేఎం. శివలింగే గౌడ, బీజేపీ సభా నాయకుడు జగదీశ్ శెట్టర్, ఆ పార్టీ సభ్యులు విశ్వేశ్వర హెగ్డే కాగేరి, కేజీ. బోపయ్య, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, బీఎస్‌ఆర్ సీపీ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
కృష్ణప్ప బిల్లు ప్రతులు చించి పైకి విసిరేశారు. ఉద్యోగుల సమ్మె హక్కును ప్రభుత్వం కాలరాయదలచుకుందని దుయ్యబట్టారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకమని విమర్శించారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్, జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా పోలీసులకు అపరిమిత అధికారాలు లభిస్తాయని, తద్వారా వారు చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు కార్మిక వ్యతిరేకమైనదని, కనుక ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్ కోరారు.
అయినప్పటికీ రామలింగా రెడ్డితో పాటు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర బిల్లును సమర్థించుకున్నారు. కాగా ఉత్పత్తి, స్టోరేజీ, పంపిణీ, సరఫరా, నీటి పంపిణీ, విద్యుత్, రవాణా సేవలు, సరుకుల రవాణా తదితర రంగాల్లో సమ్మెను ఈ బిల్లు నిషేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 2009లో తీసుకొచ్చిన కర్ణాటక అత్యవసర సర్వీసుల నిర్వహణా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఎస్మాకు ఒకే
Published Thu, Dec 5 2013 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:31 PM
Advertisement
Advertisement