నకిలీ వీసాలు, పాస్‌పోర్టుతో 12 మంది అరెస్ట్
Published Wed, Aug 21 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
సాక్షి, చెన్నై: నకిలీ వీసా, పాస్ పోర్టులతో నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పది మంది యువకుల్ని, ఓ మహిళను, మరో వ్యక్తిని మీనంబాక్కం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ పది మంది యువకులు బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి వచ్చినట్టు తేలడంతో వారు తీవ్ర వాదులా..? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.
మీనంబాక్కం జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ భద్రతా వలయాన్ని ఛేదించుకుని నకిలీ వీసా, పాస్ పోర్టులతో ఇక్కడి నుంచి విదేశాలకు, విదేశాల నుంచి ఇక్కడికి వెళ్లేందుకు యత్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర భద్రతకు సవాలుగా మారాయి. సింగపూర్, మలేషియా, శ్రీలంకల నుంచి ఈ నకిలీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరిలో కొందరు మాత్రం అధికారులకు చిక్కుతున్నారు. విచారణానంతరం కొందర్ని తిరిగి వెనక్కు పంపుతుండగా మరికొందర్ని అరెస్టుచేసి కటకటాల్లోకి పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఒకే విమానంలో పది మంది నకిలీ వీసాతో చెన్నైకు రావడం అధికారుల్ని ఆందోళనలో పడేసింది. వీరంతా తీవ్ర వాదులన్న ప్రచారం బయలు దేరడంతో మీనంబాక్కంలో కాసేపు కలకలం రేగింది.
అదుపులో పది మంది
మంగళవారం ఉదయం మలేషియా- కోలాలంపూర్ నుంచి టైగర్ విమానం చెన్నైకు వచ్చింది. ఆ విమానం నుంచి పది మంది యువకులు దిగారు. వీరి కదలికలు అనుమానా స్పదంగా ఉన్నట్టు నిఘా నేత్రాల ద్వారా భద్రతా సిబ్బంది గుర్తించారు. వీరంతా కలసికట్టుగా ముందుకు కదులుతుండడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారి పాస్ పోర్టులు, వీసాలను తనిఖీ చేశారు. వీరికి నేతృత్వం వహిస్తున్న యువకుడి పేరు మహ్మద్‌గా గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారం, వివరాలు అన్నీ పొంతన లేకుండా పోయాయి. వీసాను పూర్తి స్థాయిలో పరిశీలించారు. చివరకు ఆ పది మంది వీసాలు నకిలీవిగా తేలాయి. వీరంతా ఇండో నేషియా - బంగ్లాదేశ్‌లోని ఢాకా, కోలాలంపూర్ మీదుగా చెన్నై కు వచ్చినట్టు తేల్చారు. అలాగే తిరుగు పయనానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. చెన్నై నుంచి రైలు మార్గం గుండా ఉత్తరాధి రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు వారు పేర్కొనడంతో అనుమానాలు నెలకొన్నాయి. వీరు తీవ్ర వాదులేమోనని మీనంబాక్కం పోలీసులకు అప్పగించారు. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి క్యూబ్రాంచ్, రా, ఇంటెలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నాయి.
నకిలీ పాస్‌పోర్టుతో మరో ఇద్దరు
అదే విమానంలో మరో ఇద్దరు నకిలీ పాస్ పార్టుతో రావడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చంటి బిడ్డతో ఓ మహిళ ఉన్నారు. ఆమె పేరు నజీర్‌ఖాన్‌గా గుర్తించారు. మరొకరి పాస్ పోర్టులో ఆమె ఇక్కడికి రావడంతో అనుమానం నెలకొంది. ఆమెనూ విచారిస్తున్నారు. అలాగే మణివణ్ణన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలైకు చెందిన ఇతడు ఓ హత్య కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో ఇతడ్ని అరెస్టు చేశారు. ఒకే రోజు పది మంది నకిలీ వీసాతో, మరో ఇద్దరు నకిలీ పాస్ పోర్టుతో వచ్చి చెన్నైలో పట్టుబడడం బట్టిచూస్తే, విదేశాల్లో ఏ మేరకు తనిఖీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నిర్లక్ష్యం, ఇక్కడి భద్రతను ప్రశ్నార్థకం చేస్తుండడం గమనార్హం.
Advertisement
Advertisement