కావేరీ నదీ జలాల ప్రవాహాన్ని అడ్డుకుంటూ, కర్ణాటక ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని నిరసిస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ జరగనుంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కావేరీ నది పరివాహక ప్రాంతమైన మేఘదాతుపై రెండు ఆనకట్టల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్‌లో తొలివిడతగా *26 కోట్లు కేటాయించింది. ఈ రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే తమిళనాడులోని వ్యవసాయభూములు బీడుబారిపోతాయని రైతాంగం ఆందోళన చెందుతోంది. కర్ణాటక వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష రైతు కమిటీ ఈనెల 28వ తేదీన రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నిర్వాహకులు అధికార, ప్రతిపక్ష పార్టీలను మద్దతు కోరినా, అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. రాష్ట్రంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివే సి బంద్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. రైళ్లు, బస్సుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని ప్రభుత్వ యంత్రాగం భరోసా ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది పోలీసు బలగాలను బందోబస్తులో ఉంచుతున్నామని, బంద్‌ను అడ్డుపెట్టుకుని శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
అసెంబ్లీ తీర్మానం-డీఎంకే వాకౌట్
ఇదిలా ఉండగా, కావేరీ నదిపై ఆనకట్టల నిర్మాణం శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అంశంగా మారింది. ఆనకట్టల నిర్మాణం సాగకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం నాటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు నినాదాలు చేసి ఆమోదించారు. అయితే కర్ణాటక తీరును ఎండగడుతూ డీఎంకే కేంద్రానికి ఉత్తరం రాసిన సంగతిని ఎందుకు మరుగుపరిచారని ఆపార్టీ సభ్యులు దురైమురుగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అఖిలపక్ష రైతుల సంఘాలు తలపెట్టిన బంద్‌లో పాల్గొనేలా శనివారం అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని దురైమురుగన్ కోరారు.
అయితే ఆయన మాటలను పట్టించుకోకుండా తీర్మానంపై వివరణ ఇచ్చేందుకు సీఎం పన్నీర్‌సెల్వం సిద్ధమై ప్రసంగాన్ని ప్రారంభించడంతో స్టాలిన్, దురైమురుగన్ సహా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యుల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తారని సీఎం చెప్పారు. కావేరీపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆనకట్టల నిర్మాణంపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నేడు రాష్ట్ర బంద్
Published Sat, Mar 28 2015 2:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement