న్యూఢిల్లీ: గత ఏడాది వరకు ఫర్వాలేదనిపించుకున్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఈ ఏడాది మందగించిందనే విమర్శలు పెరుగుతున్నాయి. లైంగిక నేరాలపై సత్వర విచారణల కోసం ఢిల్లీలో ఆరు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇవి 400 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. మరో 1,090 కేసుల్లో తుది నిర్ణయాలు రావాల్సి ఉంది. అయితే సాధారణ కోర్టులు ఇదే కాలంలో 500 కేసులను పరిష్కరించడం గమనార్హం. గతేడాది అక్టోబర్ వరకు ఇలాంటి 963 కేసుల్లో తీర్పులు రాలేదు. ఈ పెండింగ్ కేసులతో ట్రయల్‌కోర్టులపై పనిభారం మరింత అధికమవుతోంది. గత డిసెంబర్ 16న నిర్భయ సామూహిక అత్యాచారం తరువాత సత్వరన్యాయం డిమాండ్ మరింత ఊపందుకుంది.
తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేసేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారని రేఖా అగర్వాల్ అనే న్యాయవాది పేర్కొన్నారు. క్రైంబ్రాంచ్ కథనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 15 వరకు ఢిల్లీలో 1,036 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్ని రకాల లైంగిక నేరాలపై కేసులు నమోదు చేయాలనే ఆదేశాలు రావడంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులపై భారం అధికమయింది. అయి తే ఈ న్యాయస్థానాల్లో అత్యాచారాల బాధితురాళ్లకు నిష్పక్షపాతంగా, వేగంగా న్యాయం దొరుకుతోం దని రాజీవ్ ఖోస్లా అనే న్యాయవాది అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణలు నిర్వహిం చడం వల్ల న్యాయమూర్తులు ఒత్తిడికి గురవుతుంటారని చెప్పారు. ‘కోర్టుల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లూ తక్కువ. వారికీ పని ఒత్తిడి అధికమవుతోంది. మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అభిప్రాయపడ్డారు.
సాధారణ కోర్టులతో పోలిస్తే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులే వేగంగా తీర్పులు వెలువరిస్తున్నాయని న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ కోర్టులు 2012లో 500 కేసులను పరిష్కరించగా, 2010లో 700, 2011లో 650 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. సత్వర విచారణ కోసం సాధారణ కోర్టులు ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం కావడం వల్ల లైం గిక వేధింపుల కేసుల విచారణ ఆలస్యమవుతోందని సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా అన్నారు. ఫిర్యాదిదారులపై ఒత్తిడి పెంచడానికి కొన్నిసార్లు నిందితులు విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు కూడా నిష్పక్షపాత నిర్ణయాలు వెలువరించడానికి తగినంత సమయం అవసరమేనని రేఖ అన్నారు.
ఇక నగరంలో ప్రాంతాల వారీగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇలా ఉంది. ద్వారక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ ఏడాది అత్యధికంగా 120 కేసులను, కార్కర్‌డూమా కోర్టు 86 కేసులను పరిష్కరించాయి. తీస్‌హజారీ కోర్టుల కాంప్లెక్స్‌లోని రెండు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు 116 కేసుల్లో తీర్పులు చెప్పాయి. సాకేత్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 39 కేసులను పరిష్కరించింది. నిర్భయ కేసులోనూ ఇదే కోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే. రోహిణి కోర్టు 40 కేసులను పరిష్కరించింది.
రెట్టింపైన అత్యాచారం కేసులు
‘నిర్భయ’పై గ్యాంగ్‌రేప్, హత్యతో పెల్లుబికిన నిరసనలకు స్పందనగా కేంద్రం తెచ్చిన నూతన అత్యాచార నిరోధక (నిర్భయ) చట్టం హస్తినలో అతివలపై అఘాయిత్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. కేంద్రం చట్టానికితోడు ఢిల్లీ పోలీసులు అమలు చేస్తున్న భద్రతా చర్యలతో అత్యాచారాలు ఆగకపోగా రెట్టింపయ్యాయి.
నిర్భయ ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30 వరకూ 1,493 రేప్ కేసులు, 3,237 లైంగిక వేధింపుల కేసులు, 852 ఈవ్ టీజింగ్ కేసులు నమోదయ్యా యి. 2012తో పోలిస్తే ఢిల్లీలో ఈ ఏడాది రేప్ కేసులు రెట్టింపవగా లైంగిక వేధింపుల కేసులు ఐదు రెట్లు పెరిగాయి. గత 13 ఏళ్లతో పోలిస్తే రేప్ కేసుల సంఖ్య ఈ ఏడాదే అత్యధికం కావడం గమనార్హం. అయితే తాము చేపట్టిన చర్యల వల్ల బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తుండటం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.
స్లోగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
Published Tue, Dec 17 2013 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement