
శివాజీ స్మారకం చుట్టూ ముదురుతున్న వివాదం
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్మారకం నిర్మాణం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిళ్లడమే గాకుండా తమ ఉపాధికి గండిపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నగరానికి వచ్చిన పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మత్స్యకారుల సంఘటన ప్రతినిధులు విన్నవించారు. దీంతో స్మారకంపై వివాదం రాజుకునే పరిస్థితి ఏర్పడింది.
స్మారకం నిర్మాణం విషయంలో ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోకపోతే, ఆందోళనను తీవ్రతరం చేస్తామని సంఘటన ప్రతినిధులు హెచ్చరించారు. విజ్ఞాన, సాంకేతిక, అటవీ, పర్యావరణ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అశ్వినికుమార్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో మత్స్యకారుల సంఘం ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల నుంచి సముద్రంలో కలుస్తున్న కలుషిత నీరు, రసాయనాలవల్ల మత్స్య సంపద రోజురోజుకు తగ్గిపోతోందని తెలిపారు. ‘‘స్టీమర్లలో చాలా దూరం వెళితే తప్ప చేపలు లభించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మిస్తున్నందున పర్యాటకుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో లాంచీలు, పడవల రాకపోకలు పెరిగిపోతాయి. వీటి నుంచి విడుదలయ్యే చమురు, ఇతర రసాయన వ్యర్థాల వల్ల చేపల సంతతి ప్రమాదంలో పడిపోతుంది.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్మారకాన్ని ఇక్కడ నిర్మించవద్దు’’ అని వారు అశ్వినికుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని పదేళ్ల కిందటే అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన వివిధ శాఖల అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. కాని ఇలాంటి సందర్భంలో మత్స్యకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.