
ఫిట్‌నెస్ భాగ్య
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో యువశక్తి కేంద్రాలు
ఒక్కో కేంద్రానికి రూ 15 లక్షల విలువైన పరికరాలు
మొదట 30 జిమ్‌ల ఏర్పాటు
అనంత రం రాష్ర్ట వ్యాప్తంగా విస్తరణ
నిర్వహణ భారం సదరు కళాశాలదే
బెంగళూరు : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా పీయూసీ (ఇంటర్ మీడియట్) కళాశాలల్లో ఆధునిక జిమ్ (వ్యాయామశాల)ను అందుబాటులోకి తీసుకుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో వెయ్యి అంతకంటే ఎక్కువగా ఉన్న 30 ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో ‘యువశక్తి కేంద్రాల’ పేరుతో అధునాతన జిమ్‌లను ఏర్పాటు చేస్తారు. జిమ్‌ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ సమకూరుస్తోంది. నిర్వహణ మాత్రం సదరు కళాశాల యాజమాన్యమే భరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రిన్సిపాల్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తారు. విద్యార్థి, విద్యార్థినులకు జిమ్ తరగతుల వేళలు ప్రత్యేకంగా ఉంటాయి. పెలైట్ ప్రతిపాదికన ముప్పై జిమ్‌లు మొదట ఏర్పాటు చేసి ఫలితాలను అనుసరించి రాష్ట్రంలోని మిగిలిన పీయూసీ కళాశాలలతో పాటు డిగ్రీ కాలేజీల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బహుశా వచ్చే జనవరి నుంచి యువశక్తి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై రాష్ట్ర యువజన క్రీడల శాఖ డెరైక్టర్ హెచ్‌ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... ‘ఒక్కో కేంద్రానికి రూ. 15 లక్షల విలువ చేసే జిమ్ పరికరాలను సమకూరుస్తాం. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. యువతను ముఖ్యంగా కళాశాల విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే చర్యల్లో భాగంగా యువశక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.’ అని తెలిపారు.