సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రులతోపాటు కొందరు కీలక నాయకులకు కల్పిస్తున్న భద్రత స్థాయిని తగ్గించింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ ద్వేషంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పలువరు ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు మొత్తం 13 మందికి ‘జెడ్ ప్లస్’ భద్రత ఉండేది. వీఐపీలకు కల్పిస్తున్న భద్రతా చర్యలపై అధ్యయనానికి రాష్ట్ర సర్కారు ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు కొందలు మాజీ మంత్రులకు భద్రత స్థాయిని తగ్గించారు.
ఇలా తగ్గించినవారిలో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ (జెడ్), మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ (వై), మాజీ హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ (ఎక్స్), మాజీ మంత్రులు నారాయణ్ రాణే (ఎక్స్), ఛగన్ భుజ్‌బల్ (ఎక్స్), మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ (ఎక్స్) తదితర నాయకులున్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ భద్రతను జెడ్ నుంచి ఎక్స్‌కు తగ్గించారు.
ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్, మాజీ స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్, మాజీ మంత్రులు జితేంద్ర అవద్, సునీల్ తట్కరే, జయంత్ పాటిల్, నసీం ఖాన్, నీలేష్ రాణే, నితేష్ రాణే, రాణా జగ్జీత్ సింగ్, శివరామ్ దల్వీ, పరశురామ్ ఉపర్కర్‌ల భద్రతను పూర్తిగా తొలగించారు.
మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ (జెడ్‌ప్లస్), శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్ధవ్‌ఠాక్రే (జెడ్), ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే (జెడ్), పోలీసు కమిషనర్ రాకేష్ మారియా (జెడ్‌ప్లస్), ఏటీఎస్ చీఫ్ హిమాంశు రాయి (జెడ్) భద్రతను పెంచారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే, ఇతర నాయకులైన ఏక్‌నాథ్ శిందే, సుధీర్ మునగంటివార్, రామ్ శిందే, రంజిత్‌పాటిల్ తదితరులకు వై భద్రతను కల్పిస్తున్నారు.
మాజీ మంత్రుల సతీమణులకు నో సెక్యూరిటీ..!
మాజీ మంత్రుల సతీమణులకు కూడా గతంలో ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పించేవారు. కానీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సతీమణి సత్వశీలా చవాన్‌తోపాటు నారాయణ రాణే భార్య నీలం రాణే, అజిత్ పవార్ భార్య సునేత్య పవార్‌ల భద్రతను పూర్తిగా తొలగించారు. అయితే ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ సతీమణి ప్రతిభా పవార్‌తోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ భార్య అమృతా ఫడణ్‌వీస్‌లకు ఎక్స్ భద్రతను కల్పిస్తున్నారు.
మాజీలకు ‘తగ్గిన’ భద్రత
Published Sat, Jan 3 2015 10:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement