మంచినీటిపై రాజకీయాలు దురదృష్టకరం
ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన
సింధనూరు టౌన్ : నగరంతో పాటు తాలూకా వ్యాప్తంగా మంచినీటి సమస్యపై విపక్ష నేతలకు అవగాహన ఉన్నా నీటి విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే హంపనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సింధనూరు నగరసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింధనూరులో నీటి సమస్య పరిష్కారానికి తాను, నగరసభ యంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయం విపక్ష నేతలకు తెలుసన్నారు. వారి వ్యాఖ్యలను గమనించానన్నారు. అనుభవజ్ఞులైన నాయకులు చేయాల్సిన వ్యాఖ్యలు కావన్నారు. ఇంకా నాలుగు నెలల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ముందు చూపుతో వ్యవహరిస్తున్నామన్నారు.
టీబీ డ్యాంలో మంచినీటి అవసరాల కోసం ఇంకా సుమారు 3 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. బహుశ ఒకసారి కాలువకు నీరు వదిలించుకునేందుకు వీలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి కాలువకు నీరు వదిలేందుకు వీలు కాదన్నారు. ఈనెల 25న సింధనూరు వాసుల దాహార్తి తీర్చేందుకే తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదులుతున్నారన్నారు. సింధనూరులోని మంచినీటి చెరువులను, గ్రామీణ ప్రాం తంలోని చెరువులను నింపుకోవాలన్నా రు. ఈసందర్భంగా నగరసభ అధ్యక్షురాలు మంజుల పాటిల్, ఉపాధ్యక్షురాలు అన్వర్ బేగం, స్థాయీ సమితి అధ్యక్షుడు శరణయ్య స్వామి వక్రాణి, సభ్యులు ప్రభురాజ్, నబీసాబ్, మహ్మద్ అలీ, షఫియుద్దీన్ నవాబ్, వెంకటేష్ బండి, సురేష్ సేఠ్, శశికుమార్, నగర యోజన ప్రాధికారం అధ్యక్షుడు ఎస్.శరణేగౌడ, ఆర్‌సీ పాటిల్, మల్లికార్జున గుంజళ్లి, నన్నుసాబ్ పాల్గొన్నారు.