సాక్షి, ముంబై: ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని..’ అన్నట్లు కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చు పెట్టే విధానం లోపభూయిష్టంగా ఉండటంతో ముంబైకర్ల కష్టాలు తీరడం లేదు. వివిధ అభివృద్ధి పనుల కోసం మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యేటా వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. అయితే పరిపాలనా విభాగంగా ఆ నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో ఖజానాలోనే మురిగిపోతున్నాయి.
కొత్త ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం మూడు నెలల సమయమే ఉండగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా ఖర్చు కాకపోవడం గమనార్హం. మిగిలిన 75 శాతం నిధులను ఈ మూడు నెలల్లో ఎలా ఖర్చు పెడతారనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిపాలనా విభాగం యేటా బీఏంసీ రూ. 30 వేల కోట్ల ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది.
కాని అందులో మంజూరు చేసిన నిధుల్లో కేవలం 25 శాతమే ఖర్చు చేస్తుండటం గమనార్హం. బీఎంసీ గత ఆర్థిక బడ్జెట్‌లో రోడ్లు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఉద్యానవనాలు, అగ్నిమాపకం ఇలా వివిధ శాఖలకు వేలాది కోట్ల రూపాయలు కేటాయించింది. కాని ఖర్చు మాత్రం అనుకున్నంత చేయలేదు. రోడ్లు, రవాణ శాఖకు రూ.2,309 కోట్లు మంజూరు చేయగా అందులో కేవలం రూ.838 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయి.
మిగతా నిధులన్నీ అలాగే మురుగుతున్నాయి. ఆస్పత్రులకు, ఆరోగ్యం కోసం ఏకంగా రూ.ఏడు వేల కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇందులో కేవలం 20 శాతం మాత్రమే ఖర్చయ్యాయి. అదేవిధంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ పనులకు కేటాయించిన నిధుల్లో 10-15 శాతం నిధులు మాత్రమే ఖర్చుపెట్టారు. ముంబైలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం మంజూరు చేసిన రూ.ఆరున్నర కోట్లలో ఒకపైసా అయినా ఖర్చు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, వివిధ ప్రాజెక్టు పనుల కోసం, పథకాల కోసం బీఏంసీ యేటా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. కాని అందులో 50 శాతం నిధులు కూడా ఖర్చు కావడం లేదు.
ఆర్థిక బడ్జెట్‌లో కేవలం సంఖ్య భారీగా చూపించడానికి పరిపాలన విభాగం ఆరాటపడుతోందే తప్ప ముంబైకర్లకు ఒరిగిందేమి లేదని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబ్రేకర్ ఆరోపించారు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేస్తే ముంబైకర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. కాని కార్పొరేటర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా రూ.వేలాది కోట్ల నిధులు వృథా అవుతున్నాయని ఆంబ్రేకర్ ఆరోపించారు.
కేటాయింపులతో సరి
Published Fri, Dec 26 2014 10:10 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement