రూ.12,000 కోట్లు ఇవ్వండి | Give Rs 12,000 crore | Sakshi
Sakshi News home page

రూ.12,000 కోట్లు ఇవ్వండి

Published Sat, Aug 1 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

రూ.12,000 కోట్లు ఇవ్వండి

రూ.12,000 కోట్లు ఇవ్వండి

♦ మరాఠ్వాడాకు నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షం డిమాండ్
♦ సమర్థించిన మిత్రపక్షం శివసేన
♦ అధికారంలో ఉన్నప్పుడు మరాఠ్వాడాకు ఏం చేశారు?
♦ కాంగ్రెస్-ఎన్సీపీని ప్రశ్నించిన మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే
♦ చేయాల్సిందల్లా చేశాం: ఎన్సీపీ నేత అజిత్ పవార్
 
 సాక్షి, ముంబై : కరవుతో అల్లాడుతున్న మరాఠ్వాడాలో రైతులను ఆదుకోడానికి రూ. 12,000 కోట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్, ఎన్సీపీ డిమాండ్‌కు బీజేపీ మిత్రపక్షం శివసేన మద్దతు తెలిపింది. మరాఠ్వాడాను ఆదుకోడానికి ప్రభుత్వం ఏవిధమైన సాయం ప్రకటించలేదని జల్నా నియోజకవర్గం శివసేన నేత అర్జున్ ఖోట్కర్ మండిపడ్డారు. పుండుపై కారం చల్లినట్లు ప్రభుత్వం రూ. 900 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుందని ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ నిప్పులు చెరిగారు. కరవు పరిస్థితులను తట్టుకోడానికి రూ. 12,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కరవు సమస్యపై అసెంబ్లీలో మంత్రి మహాజన్ సమాధానమిస్తూ.. ఔరంగాబాద్‌కు చెందిన శాసనసభ్యులతో వచ్చే వారంలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. 70-75 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మరాఠ్వాడా అభివృద్ధికి ఏమీ చేయలేదన్న మంత్రి ఆరోపణపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేయాల్సిందల్లా చేసిందన్నారు. కొన్ని తప్పిదాలు జరిగాయని అందుకే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారన్నారు. జల్నాలో మానసిక ఆరోగ్య ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ పేర్కొన్నారు.  

 నగరాల వివరాలు పంపాం
 ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు వివరాలు కేంద్రానికి పంపినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన  మాట్లాడుతూ.. ముంబై, ఠాణే, పుణే, నవీముంబై, కళ్యాణ్, అమరావతి, షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, పింప్రి చించ్‌వడ్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరాల ఎంపికకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కమిటి  రూపొందించిన ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్)ను కేంద్రానికి పంపించినట్టు ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న 100 నగరాలను స్మార్ట్ సిటీ తీర్చి దిద్దనున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మిగిలిన నగరాలను అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకంలో భాగంగా కేంద్రం అభివృద్ధి చేయనుంది. స్మార్ట్‌సిటీలకు రూ. 48,000 కోట్లు, ‘అమృత్’  కోసం రూ. 50,000 కోట్లు కలిపి మొత్తం ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

 గడువు పెంపునకు కంపెనీలు ససేమీరా
 పంటల బీమాపై ప్రీమియం గడువును పెంచాలన్న విజ్ఞప్తిని బీమా కంపెనీలు ఒప్పుకోలేదని ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలో ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే లేవనెత్తిన ప్రశ్నకు వ్యవసాయ మంత్రి ఖడ్సే సమాధానమిస్తూ.. రాత్రి వరకు బీమా కంపెనీలతో చర్చించినా ఫలితం లేద న్నారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి, సెక్రెటరీకి తెలిపామన్నారు.
 
 ‘జల్నా’ బాధ్యులను వదలం: సీఎం
  జాల్నా రేప్ ఘటనపై విచారణకు అడిషనల్ డెరైక్టర్ జనరల్ ర్యాంకు అధికారిని నియమిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఘటనపై శుక్రవారం అసెంబ్లీలో సీఎం సమాధానమిస్తూ.. బాధితురాలికి పునరావాసం కల్పిస్తామన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.  జల్నాకు చెందిన 17 ఏళ్ల యువతిని జూలై 6 న ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి సెల్‌ఫోన్‌తో అత్యాచార ఘటనను చిత్రీకరించారు. సెల్‌ఫోన్ తిరిగివ్వడానికి రూ. 2,000 డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు బాధితురాలి సాయం తీసుకున్నారు.

అయితే నిందితులను పట్టుకునే సమయంలో జూలై 9న బాధితురాలు మరోసారి అత్యాచారానికి గురైంది. అయితే బాధ్యులను పట్టుకునేందుకే బాధితురాలి సాయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ముంబై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్పందిస్తూ..  నగరంలో 40 లోతట్టు ప్రాంతాలను గుర్తించి పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రైనేజీ శుభ్రపరిచేందుకు విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టడంపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
 
 డిసెంబర్ 7 నుంచి శీతాకాల సమావేశాలు
 డిసెంబర్ ఏడు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. శీతాకాల సమావేశాలు నాగ్‌పూర్ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విధానసభ, మండలిలో ప్రిసీడింగ్ అధికారులు వెల్లడించారు. జూలై 13న మొదలైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement