నగరంలో ‘నైట్ లైఫ్’కు ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది...
సాక్షి, ముంబై: నగరంలో ‘నైట్ లైఫ్’కు ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రి సమయంలో హోటళ్లు, టీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెరిచి ఉంచడం వల్ల శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని భావించిన హోం శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నగరంలో వాణిజ్య కేంద్రాలకు నిలయమైన నారిమన్ పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ తదితర నాన్ రెసిడెన్సియల్ ప్రాంతాల్లో అనేక కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం కార్యాలయాలు రాత్రి కూడా తెరిచి ఉంటాయి.
దీంతో ముంబైతోపాటు పుణేలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇతర షాపులు 24 గంటలు తెరిచి ఉంచాలనే ప్రతిపాదనను యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే.. నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు కొద్ది రోజుల కిందట భేటీలో తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ మారియా ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు. అయితే శాంతి భధ్రతల ృష్ట్యా ప్రతిపాదనకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రులందు షాపులు, మాల్స్ తెరిచి ఉంచడంవల్ల ఆకతాయిలు, నేర చరిత్ర గల వారితో శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లుతుందని హోం శాఖ వెల్లడించింది.
ఇప్పటికే నగర పోలీసులపై పని భారం ఎక్కువగా ఉందని, షాపులకు అనుమతిస్తే మహిళలకు భద్రత కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని హోం శాఖ స్పష్టం చేసింది. అయితే వీటి వల్ల అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలాన్ని బట్టి రాత్రులందు షాపింగ్ మాల్స్, హోటళ్లు తెరిచి ఉంచడం వల్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.