‘కొత్త’ వేడుకల కోలాహలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ రోడ్లపైకొచ్చి చిందులేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు రాగానే 2015కు ఘన స్వాగతం పలికారు. చెన్నై మెరీనాబీచ్ తీరం, ఫాంహౌస్‌లు, క్లబ్బులకు పేరుగాంచిన ఈసీఆర్ రోడ్డు జనంతో నిండిపోయూయి. స్టార్ హోటళ్లలో సందడి నెలకొంది. మెరీనాబీచ్ జనసంద్రంగా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కరచాలనం చేసుకున్నారు. కేకులు కట్‌చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకురావడంతో జనాన్ని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. మద్యం మత్తలో జోగుతూ వాహనాలు నడిపేవారికి భారీ జరిమానా విధించారు. ఉట్టిపడిన ఆధ్యాత్మికత: చెన్నైలోని పార్థసారథి ఆలయం, తిరుచ్చీలోని శ్రీరంగనాథుని ఆలయంతో పాటు ఇతర ఆలయూల్లో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పార్థసారథి ఆలయంలో పూజలు చేయించారు.
కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
చెన్నై టీనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడింది. శ్రీవారి భక్తులతో తిరుమలను తలపించింది. కొత్త ఏడాది, వైకుంఠ ఏకాదశి ఒకేసారి రావడంతో ఊహించని రీతిలో భక్తులు స్వామివారి సేవలో తరించారు. సహజంగా 12 గంటలు దాటగానే నిర్వహించే స్వామివారి దర్శనాన్ని తెల్లవారుజాము 4 గంటలకు మార్చినట్లు టీటీడీ స్థానిక సలహామండలి ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయినా భక్తులు బుధవారం రాత్రి 10 గంటల నుంచే క్యూ కట్టారు. ఆలయంలో స్వామివారికి చేపట్టిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. అనంతరం 3.30 గంటలకే సర్వదర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ భక్తుల కోసం పాస్‌లు జారీచేయగా ఆ క్యూసైతం పెరిగిపోయింది. సర్వదర్శనం క్యూ రెండు కిలోమీటర్ల దూరం దాటిపోయింది. భక్తులకు రూ.25 లడ్డూ, ప్రసాదంగా ఉచిత లడ్డూలను, పసుపు, కుంకుమలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం గవర్నర్ కే రోశయ్య దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సలహామండలి అధ్యక్షులు ఆనందకుమార్‌రెడ్డి, సభ్యులు కృష్ణారావు, మోహన్‌రావు, రవిబాబు, నారాయణగుప్త తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.