ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
వెంటాడుతున్న గన్నీ సంచుల కొరత
ఆందోళనలో రైతన్నలు...
ఖరీఫ్ కోతలు ప్రారంభమయ్యాయి... పలు చోట్ల రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వలు సైతం పేరుకుపోయాయి. అయినా.. గత సమస్యే అన్నదాతలను వెన్నాడుతోంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక పోవడం.. దళారులకు రైతులు దాసోహమవడం ఈ సారి కూడా షరామామూలుగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏమోగానీ అసలు ధాన్యాన్ని కొనేవారు లేక నానా అవస్థలు పడుతున్నారు. పాలకుల పాపమో.. అధికారుల శాపమో గానీ కర్షకులు అరిగోస పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని పంటను సాగు చేయడం కంటే.. దాన్ని అమ్ముకోవడం గగనంగా మారడంతో
వారు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు.
నల్లగొండ : జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పెద్ద ఎత్తున తరలివస్తున్నా... ఇప్పటికీ ఏ ఒక్క కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది లేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారుల తీరు షరామాములే అయ్యింది. 144 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిజానికి నేడు కోనుగోలు కేంద్రాలు ప్రారంభం కావల్సి ఉన్నా... ఒక్కటంటే ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి తమకు అందిన కాడికి దండుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు చేసేలా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని ‘అడ్డికి పావుసేరు’ చందంగా అమ్ముకుంటున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్ల పై అధికార యంత్రాంగం ఇంకా మేల్కొనలేదు. గత కొద్దీ రోజులుగా వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పెద్ద ఎత్తున తరలివస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదు. మూసీ నదీ పరివాహక ప్రాంతం, ఏఎమ్మార్పీ పరిధిలోని భువనగిరి, నల్లగొండ డివిజన్ ప్రాంతాల్లో వరి కోతలు వేగం పుంజుకున్నాయి. పంటలు చేతికొస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంది. గతేడాది ఇదే సీజన్‌లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆరంభించారు. జిల్లాల విభజనలో నిమగ్నమైన అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి వస్తుందన్న ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. కానీ మూడు జిల్లాలు విడిపోవడం, ఆ తర్వాత దసర పండగ రావడంతో గ్రామాల్లో ఎక్కడా ఐకేపీ కేంద్రాలు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖరారు చేసిన కొనుగోళ్ల ప్రణాళికను ఆయా జిల్లాలకు పంపించారు. కానీ అక్కడి యంత్రాంగం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. కొత్త జిల్లాల్లో కొత్త పాలనాధికారులు కొలువు దీరడంతో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలపై స్పష్టత రావ డం లేదు. ఎ న్ని సెంటర్లు ఏర్పాటు చే యాలనే దాని పై నిర్ణయం తీసుకున్నా.. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే విషయం అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
కొనుగోళ్లను పర్యవేక్షించాల్సిన జాయింట్ కలెక్ట ర్లు సంబంధిత శాఖలైన డీఆర్‌డీఓ, సివిల్ సప్లై, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారుల తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి త్వరితగతిన ఏర్పా ట్లు చేయాల్సి ఉంది. కానీ సంబంధిత శా ఖల్లో సిబ్బంది కొరత పట్టిపీడిస్తుండడంతో కొ నుగో లు సెంటర్లను ఏరా>్పటు చేయడంలో జా ప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ సప్లై మేనేజర్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఒక్కరే కావడం, డీఆర్‌డీఓ పోస్టు యాదాద్రి జి ల్లాలో భర్తీ కాకపోవడంతో పాలనాపరంగా తలెత్తే ఇబ్బందులు అంత సులువుగా పరిష్కారం కావట్లేదు.
మిల్లర్ల పేచీ...
ఐకేపీ, పీఏసీఎస్‌లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల పంచాయితీ నడుస్తోంది. సీఎమ్మార్ ధాన్యాన్ని మర ఆడించినందుకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్ సరిపోవడం లేదని, మిల్లులను నడిపే పరిస్థితుల్లో తాము లేమని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయమై ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కమీషన్ పెంచితే తప్ప ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోబోమని మెలిక పెట్టారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మిల్లర్లు ధాన్యం దింపుకోకుంటే అధికారులకు అదొక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
మూడు జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంతో రైతులు మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. నల్లగొండ, తిప్పర్తి, భువనగిరి డివిజన్ ప్రాంతాల్లోని మార్కెట్లలో ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అయినా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు జిల్లాల్లో గన్నీ సంచుల కొరత...
యాదాద్రి జిల్లాలో 20 లక్షల గన్నీ సంచులు కావాల్సి ఉండగా, 7.8 లక్షలు సివిల్ సప్లై గోదాముల్లో ఉన్నాయి. మరో 7.2 లక్షల సంచులను నల్లగొండ జిల్లా నుంచి సర్ధుబాటు చేస్తున్నారు. ఇవిగాక ఇంకా 5.8 లక్షల గన్నీ బ్యాగుల జిల్లాలో కొరత ఉంది.
సూర్యాపేట జిల్లాలో 10 లక్షల గన్నీ బ్యాగులకు గాను 4.2 లక్షల గన్నీలు అందుబాటులో ఉండగా ఇంకా 5.8 లక్షల గన్నీల కొరత ఉంది.
నల్లగొండ జిల్లాలకు సంబంధించి 22.50 లక్షల గన్నీ సంచులకు 23 లక్షల సంచులు సివిల్ సప్లై గోదాముల్లో నిల్వ ఉన్నాయి.
తేమ యంత్రాలు, టార్ఫాలిన్లు, ఫ్యాన్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్‌కు ఎలాంటి కొరత లేదు. అన్ని వ్యవసాయ మార్కెట్‌ల్లో సిద్ధంగా ఉన్నాయి.