- తొలి ఏడాదే 65 హామీలు అమలు
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా జాగ్రత్తలు
- రైతు సంక్షేమమే లక్ష్యం
- శాసన సభలో సీఎం సిద్ధరామయ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. క్రమశిక్షణ పాటించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. శాసన సభలో బడ్జెట్‌పై సాగిన సుదీర్ఘ చర్చకు బుధవారం ఆయన సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కొట్టి పారేస్తూ, తన ప్రభుత్వ సాధనలను ఏకరువు పెట్టారు.
కర్ణాటక చరిత్రలోనే...చెప్పినట్లు నడుచుకోవడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని వెల్లడించారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో 165 హామీలిచ్చామని చెబుతూ, తొలి ఏడాదే 65 హామీలను అమలు చేశామని తెలిపారు. 2014-15 బడ్జెట్‌లో 30 హామీలను నెరవేర్చనున్నట్లు ప్రకటించామని గుర్తు చేశారు. ఏలకులు, ద్రాక్ష, వక్క రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని చర్చ సందర్భంగా సభ్యులు కోరారని, దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు ఆపన్న హస్తం అందించడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఆహారోత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలను చేపడతామని ప్రకటించారు. 2013-14లో ఆహారోత్పత్తి 131 లక్షల టన్నులని వెల్లడించారు. వర్షాధార పంటలను ప్రోత్సహించడానికి కృషి భాగ్య పథకం కింద రూ.500 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం మాని వ్యవసాయానికి తగినంత సహాయ సహకారాలు అందించే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. కర్ణాటక పాడి సమాఖ్యకు తొలిసారిగా రూ.1,400 కోట్ల సబ్సిడీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్‌ను సభ మూజవాణి ఓటుతో ఆమోదించింది. అంతకు ముందు ముఖ్యమంత్రి సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించకుండా, పరిశీలిస్తామంటూ అన్నిటినీ దాట వేసిన ందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ తెలిపారు.
పంటల సాగుపై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి,బెంగళూరు : వ్యవసాయ విధానంలో వచ్చిన నూతన ఆవిష్కరణలపై దూరవిద్యా ద్వారా శిక్షణ ఇవ్వడానికి బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఔత్సాహిక రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదవడం, రాయడం వచ్చిన రైతులు ఎవరైనా ఇందుకు అర్హులు. వివరాల కోసం 08023418883 లేదా 9449551060,9449044975 లో సంప్రదించవచ్చు.