షీలాపై యుద్ధానికి సిద్ధం
Published Fri, Nov 8 2013 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ‘మా పార్టీని ఈసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టడానికి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సేనతో అసెంబ్లీ ఎన్నికల బరిలో యుద్ధానికి తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఎన్నికల టెన్షన్ తనకు లేదన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి పోటీకి ఇష్టపడతాను.. పరీక్ష ఉందంటే ముందే సిద్ధమయ్యేవాడిని తప్పితే చివరి రోజువరకూ ఆ టెన్షన్ పెట్టుకునేవాడిని కాదు.. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థి షీలాదీక్షిత్‌తో పోటీపడేందుకు సన్నద్ధమయ్యే ఉన్నాం..’ అని ఈ డాక్టర్‌సాబ్ స్పష్టం చేశారు. ‘ప్రస్తుత రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, నిరాడంబరత ఉన్న వ్యక్తులు పనికిరారనే వాదనలున్నాయి.. అది తప్పు అని నా అభిప్రాయం.. పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ఢిల్లీ వాసుల సాయంతో ఆ ప్రభుత్వాన్ని ఓడించగలమనే నమ్మకం మాకుంది.
నేను ఎటువంటి సంక్లిష్ట పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండగలను..ఆలోచించగలను.. ఈ ఎన్నికలు ఒక సాధారణ పరీక్షల వంటివే..’ అని వర్ధన్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, పారదర్శక పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. షీలా ప్రభుత్వంతో ఎన్నికల యుద్ధానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని ఆయన చెప్పారు. ‘ఒకవేళ మున్ముందు ఆ పార్టీ వారు నాయకురాలిని(షీలాను) మారిస్తే అందరికంటే మొదట బాధపడిదే నేనే..’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కొద్ది వారాల తర్వాత ఢిల్లీవాసులు అసమర్థ, లంచగొండి పాలననుంచి విముక్తులు కానున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల యుద్ధంలో తాను మృదుస్వభావిగా, మంచివాడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు అనుకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను తప్పితే తన స్వభావాన్ని మార్చుకోనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఢిల్లీవాసులు మంచివాళ్లను, మృదుస్వభావులను, తెలివైన వారిని పనికిరానివారిగా భావిస్తే, పదవికి కోసం తాను ఆరాటపడబోనని, సిద్ధాంతాలను వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు చాచనని ఆయన స్పష్టం చేశారు.
కేజ్రీ వాల్‌పై వ్యాఖ్యానిస్తూ.. ‘కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది కాని అది పార్టీకి ఎన్నికల్లో లాభపడబోదు..’ అని వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు అభినందిస్తున్నట్లు ఈఎన్‌టీ వైద్యుడు కూడా అయిన వర్ధన్ తెలిపారు. ఢిల్లీవాసులు ప్రస్తుత షీలా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, కాంగ్రెస్‌కు ఈసారి పరాభవం తప్పదని విశ్లేషించారు. 70-80 శాతం ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనతో అసంతృప్తిగా ఉన్నట్లు తాము పార్టీపరంగా నిర్వహించిన సర్వేల్లో తేలిందని వర్ధన్ తెలిపారు. ‘షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని చాలా సాదాసీదాగా నడుపుతున్నారు.ఈ 15 ఏళ్లలో క్లిష్టమైన సమస్యలేవీ పరిష్కరించలేకపోయారు. నీటిసరఫరాలో వైఫల్యం, నిరుద్యోగం, ఇళ్ల పంపిణీ వంటి సమస్యల పరిష్కారంలో షీలా ప్రభుత్వం విఫలమైంది.
ఈ పదిహేనేళ్లలో ఒక్క మురికివాడవాసికైనా ఇంటిని కేటాయించగలిగారా.. 2008లో ప్రతి ఒక్క మురికివాడ వాసికి సొంత ఇళ్లు ఇప్పిస్తామని షీలా హామీ ఇచ్చారు కాని నిలబెట్టుకోలేకపోయారు. అనధికార కాలనీల్లో ఒక్కదానికైనా గుర్తింపు లభించిందా.. నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ మంచినీటికి నోచుకోలేకపోతున్నాయి..’అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ‘నగరంలో మహిళలకు రక్షణ లేదు.. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే అది తమ పరిధిలోలేదని షీలా తప్పించుకుంటున్నారు తప్పితే నష్ట నివారణకు ఆమె తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవు..’ అంటూ దుయ్యబట్టారు. గత పదిహేనేళ్లుగా షీలా ప్రభుత్వానికి అదృష్టం ఉండబట్టే అధికారంలో ఉండగలిగారు.. ప్రజలు మమ్నల్ని తిరస్కరించలేదు.. వారిని ఆదరించారు అంతే.. ప్రజలు స్థానిక ఎన్నికల్లో విజయం అందించడం ద్వారా పదేళ్లుగా మాకూ సమాన అవకాశం ఇచ్చారు..’ అని వర్ధన్ విశ్లేషించారు.
Advertisement