
వివాహేతర సంబంధం.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
చెన్నై: మహిళా పోలీసుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. తిరుచ్చి కేకేనగర్‌కు చెందిన పన్నీర్ సెల్వం (39) సాయుధ పోలీసు దళంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. సెల్వం భార్య అర్బుతమేరి (36) ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త సాయుధ పోలీసు దళంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అంతేకాకుండా అదనపుకట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నట్లు పోలీసు కమిషనర్ సంజయ్ మాథూర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో అర్బుతమేరి పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరపాలంటూ కమిషనర్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు పన్నీర్ సెల్వంను, మహిళా పోలీసును కంటోన్మెంట్ మహిళా పోలీసు స్టేషన్‌లో హాజరుపరిచారు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పన్నీర్ సెల్వంపై కేసు నమోదైంది. దీంతో సెల్వంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతన్ని సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి పోలీసు భద్రతతో చికిత్స అందిస్తున్నారు. ఇలావుండగా పన్నీర్ సెల్వంను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు.