బెంగళూరు, న్యూస్‌లైన్ : ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్ నేపథ్యంలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాలు, ఉత్తర కన్నడ జిల్లాలో హైఅలర్డ్ ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి బెంగళూరులోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. మెజిస్టిక్, సిటీ మార్కెట్, శివాజీనగర తదితర బస్టాండ్లలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సున్నితమైన ప్రాంతాలలో మఫ్టీలో పోలీసులు సంచరిస్తూ వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.
కొత్త ముఖం కనిపిస్తే వెంటనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బెంగళూరు వాసులలో ఎవరితోనైనా భత్కల్ సోదరులకు సంబంధాలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ జన్మించిన ఉత్తర కన్నడ జిల్లాతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. బెంగళూరులోని విధానసౌధ, రాజభవన్, హైకోర్టుతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కట్టడాలు, ఐటీ, బీటీ సంస్థల కార్యాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శివాజీనగర చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రంగంలోకి అదనపు బలగాలను దింపారు.
బీహార్‌కు కర్ణాటక పోలీసులు : సీఎం
రాష్ర్టంలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన యాసిన్ భత్కల్‌ను అరెస్ట్ చేసినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ.... బెంగళూరులో చోటు చేసుకున్న పేలుళ్ల విషయమై భత్కల్‌ను విచారణ చేసేందుకు రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారుల బృందాన్ని బీహార్‌కు పంపినట్లు తెలిపారు. యాసిన్ భత్కల్ కోసం చాలా కాలంగా పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. కర్ణాటక పోలీసులకు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తిగా సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
యాసిన్ తీసుకు వస్తాం : ఔరాద్కర్
బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో భాగంగా యాసిన్ భత్కల్‌ను ఇక్కడికి తీసుకువచ్చి విచారణ చేస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 2010 ఏప్రిల్ 17న చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ ప్రధాన నిందితుడు అని అన్నారు. వీలైనంత త్వరంగా యాసిన్‌ను బెంగళూరు తీసుకు వస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బృందం బీహార్ వెళ్లిందని తెలిపారు.