
నేరాల నగరం చెన్నై
చెన్నై నగరం నేరాలకు నిలయంగా మారుతోందని, ఇందుకు పోలీసు శాఖ నిర్లక్ష్యమే కారణమని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
టీనగర్: చెన్నై నగరం నేరాలకు నిలయంగా మారుతోందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు పోలీసు శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో నగరంలో చోటు చేసుకున్న వివిధ నేరాల జాబితాను వివరించారు. ఆ జాబితా ఇలా ఉంది.
ఈ నెల 2న చెన్నై నందనంలోని వస్త్ర వ్యాపారి ఇంట్లో రూ. కోటి విలువైన నగలు, నగదు చోరీకి గురయ్యాయి... అదే విధంగా ఉసిలంపట్టి సమీపంలో అక్కాతమ్ముళ్ల హత్య జరిగింది. 3న తిరుచ్చుళిలో డీఎంకే యూనియన్ కోశాధికారి హత్య .. 4న తాంబరం ప్రాంతంలో ముగ్గురు మహిళల నుంచి చైన్ స్నాచింగ్... తిరువన్నామలై జిల్లా, ముళువంబట్టు గ్రామంలో అంధుని కుమార్తె 13 ఏళ్ల విద్యార్థిని అశ్వినిపై అత్యాచారం ఆపై హత్య ... 7న అంబత్తూరు పండ్ల వ్యాపారి ఇంట్లో రూ. రెండున్నర లక్షల చోరీ... చెన్నై పెరియమేడులోని ఫైనాన్స్ యజమాని హత్య... 8న పట్టుకోట్టై వరదరాజ పెరుమాళ్ ఆలయంలో రెండు కిలోల బంగారు నగల చోరీ ... ఆరణిలో ఐదు దుకాణాల్లో చోరీ ... పెరియమేడు పోలీసుస్టేషన్ సమీపంలో ఆర్‌టీఐ చట్ట సలహాదారు ఇలంగో హత్య... చెన్నై మనపాక్కంలో ఏడు కొత్త కార్ల చోరీ... విల్లివాక్కంలో తాళం వేసిన ఇంట్లో 15 సవర్ల నగలు చోరీ... అరియలూరు సమీపాన తమిలర్ నీతి కట్చి నిర్వాహకులు మురుగేశన్ హత్య... 9న కోవైలో మాజీ డీఎస్పీ ఇంట్లో 30 సవర్ల నగలు చోరీ... వడపళనిలో బ్యాంకు ఉద్యోగి నాగేశ్వరరాజ్ హత్యా జరిగాయని కరుణానిధి ఆ ప్రకటనలో వివరించారు.
ఈ జాబితాలో వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలను చేర్చలేదని తెలిపారు. చెన్నై, పరిసర ప్రాంతాల్లో గత 10 రోజుల్లో జరిగిన హత్యలు, చోరీలు, చైన్ స్నాచింగ్‌లు తదితర నేరాలను పరిశీలిస్తే అసలు పోలీసు శాఖ పనిచేస్తోందా? అనే సందేహం కలుగుతోందన్నారు. అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రాన్ని శాంతివనంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని, నేరాలను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ప్రకటించారని అయితే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. ఆదిలోనే హంసపాదు అన్న విధంగా ప్రభుత్వం పనిచేసే తీరు ఇదేనా? అంటూ జయలలిత ప్రభుత్వంపై మండిపడ్డారు. చెన్నై నగరం కిరాయి మూకల గుప్పెట్లో నడుస్తోందా? అన్న సందేహం ఏర్పడుతోందని తెలిపారు.