హిజ్రాకు ఎస్‌ఐగా పోస్టింగ్ ఇవ్వాల్సిందే | hijra to SI posting orders for Chennai High Court | Sakshi
Sakshi News home page

హిజ్రాకు ఎస్‌ఐగా పోస్టింగ్ ఇవ్వాల్సిందే

Published Fri, Nov 6 2015 9:16 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

హిజ్రాకు ఎస్‌ఐగా పోస్టింగ్ ఇవ్వాలని చెన్నై హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.

* చెన్నై హైకోర్టు తీర్పు   
* మూడో కేటగిరీలో ఉద్యోగ కల్పనకు ఆదేశం

చెన్నై : రాష్ట్ర పోలీసు శాఖలో  త్వరలో హిజ్రా ప్రితికా యాస్ని సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నది. ప్రితికాకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మద్రాసు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో మూడో కేటగిరి(హిజ్రా)లకు ఉద్యోగ కల్పనకు విధి విధానాలను రూపొందించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సూచించారు.

ఇటీవల రాష్ట్ర పోలీసు యూనిఫాం రిక్రూట్ మెంట్ బోర్డు నేతత్వంలో రాత పరీక్షలు జరిగాయి. ఇందుకు హిజ్రా ప్రితికా యాస్ని దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో మూడో కేటగిరికి సంబంధించిన వివరాలు లేని దృష్ట్యా,  స్త్రీగా పేర్కొన్న ప్రదేశంలో  టిక్ చేశారు. అయితే, పరిశీలనలో ప్రితికా హిజ్రాగా తేలింది. దీంతో ఆమెను  పరీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే,  కోర్టును ఆశ్రయించి మరీ పరీక్ష రాసిన యాస్ని హిజ్రాలకే ఆదర్శంగా నిలుస్తూ తన సత్తాను చాటుకున్నారు.

 

అలాగే, ఫిజికల్ తదితర అన్ని రకాల  టెస్టుల్లోనూ రాణించి సబ్ ఇన్‌స్పెక్టరు అయ్యేందుకు  అవసరమైన అన్ని అర్హతలు సాధించారు. అయితే, ఆమెకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. హిజ్రా అన్న ఒక్క కారణంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో తనకు పోస్టింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ మళ్లీ కోర్టు మెట్లను ప్రితికా యాస్ని ఎక్కారు. ఆమె పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణన్ నేతత్వంలోని ప్రధాన బెంచ్ పరిగణలోకి తీసుకుంది. విచారణ చేపట్టింది. గురువారం రాష్ట్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. హిజ్రాలకే ప్రితికా యాస్ని ఆదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొంటూ, మూడో కేటగిరిలో ఉన్న హిజ్రాలకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి విధి విధానాలను త్వరితగతిన రూపొందించి, అమలు చేయాలని సూచించారు.

 

అప్పుడే ప్రితికా యాస్నిను ఆదర్శంగా తీసుకుని మూడో కేటగిరి వారు అన్ని రంగాల్లో రాణించేందుకు ముందుకు వస్తారని అభిప్రాయ పడ్డారు. రాత పరీక్షల్లో, ఫిజికల్ తదితర  టెస్ట్‌ల్లో అర్హత సాధించిన ప్రితికా యాస్నికి సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు సంబంధించిన నియామక ఉత్తుర్వులను త్వరితగతిన జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశంతో త్వరలో రాష్ట్ర పోలీసు శాఖలో ప్రితికా యాస్ని సబ్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రా జాబితాలోకి ఎక్కబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement