
హిల్లరీ నిర్ణయానికి 'అమ్మే' కారణమట!
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగడానికి కారణమేంటి? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ పొందడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? దీనికంతటికీ కారణం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాము చెబుతున్నారు. సాక్షాత్తూ తమిళనాడు అసెంబ్లీలో ఈ విషయం చెప్పి అమ్మభక్తి చాటుకున్నారు. రెండేళ్ల క్రితంలో అన్నాడీఎంకేలో చేరిన రాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
'అమెరికా చరిత్రలో ఓ మహిళ (హిల్లరీ) తొలిసారి ప్రధాన పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ ఘనతంతా అమ్మదే (జయలలిత). హిల్లరీ భారత్ పర్యటనకు వచ్చినపుడు అమ్మను కలిశారు. ఈ సమావేశానికి ఎంతో చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. అమ్మతో మాట్లాడాక హిల్లరీ ఎంతో స్ఫూర్తిపొందారు. అమ్మ వ్యక్తిత్వం, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం గురించి తెలుసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీచేసేలా హిల్లరీ ప్రేరణ పొందారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా నామినేషన్ పొందారు. దీనికంతటికీ కారణం అమ్మే' అని అసెంబ్లీలో రాము చెప్పారు.