హోటల్ గదుల ధరలకు రెక్కలు
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారాన్ని సొమ్ము చేసుకుంటున్న యజమానులు
న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ శనివారం ప్రమాణస్వీకారం చేయనుండడంతో వివిధ హోటళ్లలోని గదుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రానుండడంతో హోటల్ యజమానులు గదుల కోసం వచ్చే వారి నుంచి 200 శాతం అధిక ధరలను వసూలు చేస్తున్నారు.
పహారాగంజ్-కరోల్‌బాగ్‌లోని హోటళ్లలో మామూలుగా ఉండే రూ.500-1200 గదుల ధరలు ఇప్పుడు రూ.2,500కు చేరుకున్నాయి. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో నగర సందర్శనకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే రెండు రోజులుగా సందర్శకుల తాకిడి పెరగడాన్ని కూడా సందట్లో సడేమియాగా హోటల్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక హోటళ్లలోని గదులు సందర్శకులతో నిండిపోయాయి.
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గదుల ధరలకు రెక్కలొచ్చాయని పహారాగంజ్‌లోని ఓ హోటల్ యజమాని తెలిపాడు. ఇదే అదునుగా గదుల ధరలను రూ.700 నుంచి రూ. 1,500కు పెంచి అద్దెకు ఇచ్చిన ట్టుమరో యజమాని తెలిపాడుు. మరో రెండు వారాల పాటు ఈ పరిస్థితిలో మార్పు వచ్చే సూచన లేకపోవడంతో గదులు దొరకని సందర్శకులు సహాయం కోసం ఆప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే కార్యకర్తల కోసం ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఎవరికి వారే చేసుకోవాలని కోరినట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.