పోలీసులే వ్యభిచార గృహ నిర్వాహకులు
Published Tue, Aug 27 2013 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
సాక్షి, న్యూఢిల్లీ: పంటకు కంచె కాపలా, ఆ కంచే చేను మేస్తే... ఢిల్లీ రాణీబాగ్ ప్రాంతంలో అచ్చంగా ఇదే జరుగుతోంది. ఇద్దరు కానిస్టేబుళ్లు చాలా కాలంగా ఇక్కడ ఒక వ్యభిచార గృహన్ని అదురుబెదురు లేకుండా నడుపుతున్నారు. ఎట్టకేలకు వీరి పాపం పండి పోలీసులు చేసిన దాడిలో పట్టుపడ్డారు. వీరు కేవలం వ్యభిచార గృహ నిర్వహణలోనే కాకుండా, బెదిరించి డబ్బు వసూలు చేయడంలోనూ కీలకపాత్ర పోషించేవారని, ఓ వ్యక్తిని బెదిరించి రూ. మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని ఉన్నతాధికారులు తెలిపారు.
అత్యాచారం కేసుకు సంబంధించి తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకుండా ఉండేందుకు నగర పోలీసులు తనవద్ద నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజస్థాన్‌లోని ఝూంఝ్‌నూ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ మనోజ్‌కుమార్, మంగోల్‌పురి నివాసి, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న పవన్‌కుమార్ ల మీద నిఘావేశారు. విచారణలో ఈ ఇద్దరు రాణీబాగ్ ప్రాంతంలో వ్యభిచార గృహన్ని నిర్వహిస్తున్నారని వెల్లడయింది.
వీరి బెదిరింపుతో మూడు లక్షలు ముట్ట జెప్పిన వ్యక్తి ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ అదనపు పోలీసు కమిషనర్ రవీంద్ర యాదవ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీపీ రవీంద్రయాదవ్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఈ ప్రత్యేక బృందం చేసిన దాడిలో మహిళతో పాటు ఐదుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. నిందితుల్లో ఇద్దరు భార్యాభర్తలని, ఒకరు హోమ్‌గార్డ్ అని, మరొకరు మంగోల్‌పురిలో కిరాణా దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. వీరు రాణీబాగ్‌లో నడుపుతున్న వ్యభిచార గృహనికి క్రైం బ్రాంచ్ పోలీసు కానిస్టేబుల్ పవన్, రాజస్థాన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సహకారం అందించారని విచారణ అధికారులు తెలిపారు. రాణీబాగ్ వ్యభిచార గృహనికి వచ్చే విటులను బెదిరించి ఈ కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేసేవారని అన్నారు.
Advertisement
Advertisement