అనుమానమా..ఆటవికమా!?
► భార్యాపిల్లలపై కత్తితో ఉన్మాదిలా దాడి
► కత్తిపోట్లకు గర్భంలోని శిశువు మృతి
► భార్య, రెండేళ్ల కుమార్తె మత్యుపోరు
► దాడి తర్వాత ఆత్మహత్య చేసుకున్న భర్త
► బర్త్‌డే వేడుకవేళ ఆ ఇంట విషాదం
సాక్షి ప్రతినిధి/ తిరుపతి క్రైం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య పుట్టిన రోజు. సందడిగా, సంతోషాలు వెల్లి విరియాల్సిన రోజు. ప్రేమ, ఆప్యాతలు పంచుకోవాల్సిన రోజు. పుట్టిన రోజు వేడుకలతో సరదాగా గడపాల్సిన రోజు. నెలలు నిండిన గర్భిణీ అయిన భార్యను మురి పెంగా దగ్గరకు తీసుకోవాల్సిన రోజు. అయితే.... సాత్విక్ కుమార్ ఇంట్లో ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఊహించని దారుణం చోటు చేసుకుంది. భార్యతో పాటు మూడేళ్ల చిన్నారిని క్రూరంగా కత్తితో పొడిచిన భర్త అదే కత్తితో గొంతుకోసుకుని కన్నుమూసిన సంఘటన ఆ కుటుంబాన్నీ, బంధుగణాన్నీ తీరని విషాదంలో నింపింది.
అనుమానమో, లేక ఆటవికత్వమో తెలి యదు గానీ...అగ్నిసాక్షిగా పెళ్లాడిన భా ర్యను కత్తితో పొడిచి తానూ రక్తపు మడుగులో విగతజీవుడైన సంఘటన అబ్బన్నకాలనీలో సంచలనం రేపింది. అటు పోలీసులు, ఇటు నగర ప్రజలు విస్మయా న్ని వ్యక్తం చేసే దారుణం జరిగి పోయిం ది. కట్టుకున్న భార్యపై అనుమానంతో తల నరికి వేరు చేసిన సంఘటన మరువక ముందే బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటన పోలీసులను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది.
అసలేం జరిగిందంటే...
తిరుపతి ఈస్ట్ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుపతి నగరానికి చెందిన కొత్తపల్లి సాత్విక్ కుమార్‌కి 2011లో తమిళనాడులోని పలసరవాకం పోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శ్యామలమ్మ కుమార్తె మహాలక్ష్మితో వివాహమైంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం కూడా. దగ్గర బంధువులు కావడంతో పెద్దలు ఇష్టపడి పెళ్లి చేశారు. వివాహం తరువాత తిరుపతి అబ్బన్న కాలనీలోని చిన్నారి ఆస్పత్రి సమీపంలో నివాస ముంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న సాహితీ ఉంది. ప్రస్తుతం మహాలక్ష్మి 9 నెలల నిండు గర్భిణీ. కాగా సాత్విక్‌కుమార్ కొన్నాళ్ల పాటు ఓ ప్రయివేట్ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేసి మూడు నెలల కిందటే మానేశాడు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రస్తుతం ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తున్నాడు.
సీన్ కట్ చేస్తే...
బుధవారం ఉదయం 10.30 గంటలకు కుమార్తె సాహితీని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన సాత్విక్ భార్యతో సంతోషంగానే గడిపాడు. మధ్యాహ్నం 12 తరువాత సాత్విక్ కుమార్ తన అత్త శ్యామలకు ఫోన్ ∙చేసి తిరుత్తణి నుంచి చిత్రాన్నం తెమ్మని చెప్పాడు. సరేనన్న శ్యామల హడావుడిగా తిరుపతి బస్‌లో బయలుదేరింది. సమయం ఒంటిగంట దాటాక సాత్విక్ కుమార్ ఇంట్లో ఏం జరిగిందో తెలియదుగానీ...రక్తపు చేతులతో రక్షించండంటూ మెట్లు దిగుతున్న మహాలక్ష్మిని పక్కనే ఉన్న డాక్టర్ రామకృష్ణ ఆస్పత్రిలో చేర్చారు. పక్కనే రక్తమోడుతున్న సాహితీని కూడా దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు.
భార్యాపిల్లలపై కత్తితో దాడి చేసిన సాత్విక్ అదే కత్తితో తన గొంతు కోసుకుని వంట గదిలో మృతి చెందాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహాలక్ష్మి కడుపులోని శిశువును రుయా ఆస్పత్రి వైద్యులు బయటకు తీశారు. అయితే కత్తిపోట్ల కారణంగా బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లి పరిస్థితి విషమంగానే ఉంది. ఇటు సాహితీకి కూడా వైద్యం అందుతోంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ రామకిషోర్‌లు వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ‘ఎంత డబ్బయినా పర్వాలేదు. పాపకు వైద్యం అందించండని’ డీఎస్పీ నంజుండప్ప తన పెద్ద మనసును చాటుకున్నారు.
ఫోనే కీలకం...
ఇదిలా ఉండగా ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాలంటే...సాత్విక్ వాడే సెల్ ఫోనే కీలకం. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు దీన్ని స్వాధీనపర్చుకుని విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకూ కుటుంబంతో బాగా గడిపిన సాత్విక్ అకస్మాత్తుగా ఎందుకిలా ఉన్మాదిగా మారాడు? అసలేం జరిగింది...అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఫోన్ సంభాషణలను విశ్లేషించాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు.
చావుబతుకుల్లో భర్త గురించే...
రుయా ఆస్పత్రిలో ఉన్న మహాలక్ష్మిని పలకరించాను. తనపై దాడి చేసింది భర్తేనని చెప్పింది. పైగా తన హస్బెండ్ ఎలాగున్నారని అడిగింది. ప్రస్తుతం ఆమెకు రుయాలో వైద్యం అందుతోంది. కేసును సీరియస్‌గా తీసుకున్నాం. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. హత్యోదంతానికి గల కారణాలను రెండు రోజుల్లోగా ఛేదిస్తాం.
– పీవీఎస్ రామకిషోర్, సీఐ.