అలా కాకుంటే ఎదిగేవాళ్లం కాదు
అలా కాకుంటే మేమిప్పుడిలా సొంత కాళ్ల మీద నిలబడేవాళ్లం కాదు అంటున్నారు నటి శ్రుతిహాసన్. మేటి కథానాయికల్లో ఈ బ్యూటీ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోలందరూ తమకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తే బాగుండుననుకునే స్థాయికి ఎదిగారీమె. కథల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తూ విజయాల బాటలో దూసుకుపోతున్న ఈ క్రేజీ భామ నటించిన పులి చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. అలాగే అజిత్ సరసన నటిస్తున్న వేదాళం చిత్రం దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. ఇలా భారీ చిత్రాల్లో నటిస్తూ సూపర్ కమర్షియల్ హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రుతిహాసన్ తన మనసులోని మాటను వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడరు.
శ్రుతికి తన తండ్రి కమలహాసన్ అంటే ఎనలేని అభిమానం. దాన్ని మరోసారి తన మాటల్లో బహిరంగపరిచారు. ఆ ప్రేమాభిమానాలు తను ఎలా వ్యక్తం చేశారో చూద్దాం. ప్రపంచంలోనే ఉన్నతమైన తండ్రి మా నాన్న. పిల్లల్ని ఎలా పెంచాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లల్ని స్వతంత్రంగా జీవించేలా చేసే ఆయన చర్యల్ని అందరూ గమనించాలి. నాన్న మాకలా స్వేచ్ఛనివ్వకపోతే ఇప్పుడిలా సొంత కాళ్ల మీద నిలబడేవాళ్లం కాదు. చిన్న తనం నుంచే నాన్న మాకు స్వతంత్రంగా జీవించే స్వేచ్ఛనిచ్చారు. తప్పుల నుంచి పాఠం నేర్చుకుంటారనేదే నాన్న భావన. ఆయన పెంపకంలో పెరిగిన నేనిప్పుడు ఏది తప్పో? ఏది ఒప్పో తెలుసుకోగలుగుతున్నాను.
అందుకే నాన్న అంటే నాకు అంత ప్రేమ. చిన్నతనంలో ఒక సారి నాన్న నా వద్దకు వచ్చి ఒక భారీ బడ్జెట్ చిత్రం చెస్తున్నాను.అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ పెద్ద ఇల్లు మారి చిన్నింట్లో జీవించాల్సిన పరిస్థితి కూడా కలగవచ్చు. నీకు సమ్మతమేనా?అని అడిగారు.నేనప్పుడు మాతో మీరు ఉంటే చాలు నాన్న అని అన్నాను.మా నాన్న చాలా నిజాయితీపరుడు.చిన్నతనంలో నాన్న అంటే ప్రేమ మాత్రమే ఉండేది. ఇప్పుడు గౌరవం పెరిగింది.