అన్నీ నాన్న దగ్గరే నేర్చుకున్నా!
ఇంటర్వ్యూ
శ్రుతిహాసన్... పేరు వినగానే ఓ సినిమా కుటుంబం గుర్తుకు వస్తుంది.
చారుహాసన్, సుహాసిని తండ్రీ కూతుళ్ల తరం కాస్త కనుమరుగు కాగానే ఆ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ అడుగుపెట్టింది.
ఆ తండ్రి నుంచి ఈ కూతురు నేర్చుకున్న పాఠాలు, ఫార్ములాలు ఫాదర్స్ డే సందర్భంగా...
♦ చిన్నప్పుడు మీ నాన్నతో కలసి షూటింగ్స్‌కి వెళ్లేవారా?
నేను చూసిన తొలి సినిమా షూటింగ్ నాన్నగారు చేసిన ‘విచిత్ర సోదరులు’. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను.
♦ షూటింగ్ సమయంలో నాన్నను చూసినప్పుడు ఏమనిపించేది?
అమ్మో! నాన్న చాలా డేరింగ్ అనుకున్నాను. ఓ సినిమా కోసం ఆయన సింహాలు, పులులతో కలసి నటించారు. అది చూసి థ్రిల్ అయ్యా.
♦ కమల్‌హాసన్ కూతురు అనే ట్యాగ్‌ను ఎదుర్కోవడం ఎలా ఉంది?
ఇందులో కొంత సౌకర్యం ఉంటుంది, కొంత కష్టమూ ఉంటుంది. ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన కూతురిననే అభిమానం నా మీద కూడా చూపిస్తారు. నేను నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా ఆయనను పోలిన కదలికల కోసం చూస్తుంటారు. అదేమీ ఇబ్బంది కాదు. అయితే నేను నటించడానికి సీన్‌లోకి ఎంటర్ కాక ముందే నా ఫెర్ఫార్మెన్స్‌ని నాన్నతో పోల్చి చూడడానికి సిద్ధమైపోతుంటారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన యాభై ఏళ్లకు పైగా నటిస్తున్నారు. అంతటి నటుడితో నన్నే కాదు, మరెవరినీ పోల్చలేం.
♦ ‘కమల్ కూతురు’ అనే ఇమేజ్ నుంచి బయటపడటానికి చాలానే కష్టపడి ఉంటారు?
అవునండీ. అదైతే నిజమే. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కృషి చేశాను. ఇప్పుడు అందరూ నన్ను నన్నుగానే గుర్తిస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది.
♦ పాత్రలపరంగా ప్రయోగాలు చేసే కమల్ జీవితంలో చేసిన ప్రయోగాలు ఏమైనా?
‘విశ్వరూపం’ సినిమా తీయడమే పెద్ద ప్రయోగం. దాని కోసం ఆయన చాలా ఆందోళన చెందారు.
♦ ఆ ప్రయోగం అనవసరమని మీకెప్పుడైనా అనిపించిందా?
మా ఇంట్లో అందరికీ సినిమా అత్యంత ప్రధానమైనది. సినిమాని ఉన్నత స్థాయిలో ఉంచి గౌరవిస్తాం. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడం. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటాం.
♦ ఆ సినిమా విడుదలలో అవరోధాలు ఎదురైతే కుటుంబం పరిస్థితి ఏంటని మీకు భయం వేయలేదా?
ఏ మాత్రం లేదు. నాన్న ఆర్థిక స్థితిగతులు వేరు, నావి వేరు. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నాన్న డబ్బు మీద ఆధారపడి మా ఖర్చులు పెంచుకోలేదెప్పుడూ. అందుకే అలాంటి భయానికి తావే లేదు.
♦ మీ సంపాదనను నాన్నగారితో చర్చిస్తారా?
ఆయనెప్పుడూ అడగరు. మొదటి సినిమా నుంచే సొంతంగా మనీ మేనేజ్ మెంట్ చూసుకుంటున్నాను. నాన్న చిన్నప్పుడే మాకు బాధ్యతగా ఉండడం నేర్పించారు. చేతిలో డబ్బు ఉంది కదా అని దుబారా చేయడం అలవాటు కాలేదు.
♦ మీ అమ్మానాన్నలు విడిపోయిన తర్వాత మీరు ఎవరి దగ్గర పెరిగారు?
ఇద్దరి దగ్గరా పెరిగాను, ఇద్దరితో మంచి అటాచ్‌మెంట్ ఉంది. అయితే అమ్మ దగ్గర చనువెక్కువ. నాన్న నుంచి నేర్చుకున్నవే ఎక్కువ.
♦ కథ ఎంపికలో, వస్త్రధారణ గురించి పేరెంట్స్ సలహాలిస్తుంటారా?
ఎవ్వరూ ఇవ్వరు. కథ ఎంపిక పూర్తిగా నాదే. ఇక దుస్తుల ఎంపిక అనేది కథను బట్టి దర్శకులు నిర్ణయిస్తారు.
♦ ఈ రంగంలో గాసిప్‌లను ఎదుర్కోవడంలో మీ నాన్న అండ ఉంటుందా?
సినిమా ఇండస్ట్రీని మధించిన వ్యక్తి కాబట్టి నాన్నకు అన్నీ అర్థమవుతాయి. సెలబ్రిటీల గురించి ఏదో ఒక కథనం అలా ప్రచారమవుతూ ఉంటుంది. వాటన్నింటినీ పట్టించుకోవడం నా పని కాదు. నటించడమే నా పని... ఇదీ నాన్న నుంచి నేర్చుకున్న పాఠమే.
♦ మీకు - మీ నాన్నగారికీ పూర్తిగా వైవిధ్యం ఉన్న అంశం ఒకటి చెప్తారా?
నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఆయన నమ్మరు.
♦ మీకు దేవుణ్ని నమ్మడం, భక్తి అమ్మ నుంచి అలవాటైందా?
అమ్మ (సారిక) ఆధ్యాత్మికతను ఇష్టపడుతుంది, దేవుణ్ని నమ్ముతుంది. కానీ గుడికి వెళ్లదు. నేను గుడికి కూడా వెళ్తాను.
♦ ‘మా నాన్న గ్రేట్’ అని మీరు ఆనందపడిన సందర్భం?
ఈ మధ్య నేను సినిమాలతో చాలా బిజీగా గడిపేయడాన్ని గమనించారు నాన్న. ఇలాగే కొనసాగితే నాలోని రైటర్ కనుమరుగవుతుందనుకుని నన్ను ‘రాయడం మానవద్దని’ హెచ్చరించారు. స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్‌వేర్, రైటింగ్ కోర్స్ మెటీరియల్ బహుమతిగా ఇచ్చారు. నన్ను ఇండిపెండెంట్‌గా ఉండమని, నా గురించి ఏదీ పట్టించుకోనట్లు కనిపిస్తూనే, నన్ను ఓ కంట కనిపెట్టే ఉన్నారనిపించి చాలా సంతోషం కలిగింది. రియల్లీ గ్రేట్ ఫాదర్.