ఘజియాబాద్, నోయిడాలలో విద్యుత్ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
పెరగని ఉత్పత్తి: పెరిగిన డిమాండ్
నోయిడా: ఘజియాబాద్, నోయిడాలలో విద్యుత్ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం రద్దీ సమయాల్లో డిమాండ్ కంటే 2,500 మెగావాట్ల విద్యుత్ తక్కువగా ఉండడమే. కాగా రాష్ట్రానికి 13 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రస్తుతం 10 వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందంది. ఈ కొరత సమస్యను అధిగమించేందుకుగాను ప్రైవేటు సంస్థల నుంచి యూపీపీసీఎల్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది.
ఇదే విషయమై ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్) ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ తమ సంస్థ పశ్చిమకారిడార్ నుంచి యూపీపీసీఎల్ కేవలం 500 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రమంతటా సంక్షోభం నెలకొనడంతో దాని ప్రభావం ఘజియాబాద్‌పైనా పడిందన్నారు. రాష్ట్ర రాజధాని నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నామని, అది విడతల వారీగా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సగటు డిమాండ్ 1,500 మెగావాట్ల నుంచి రెండు వేల మెగావాట్లవరకూ పెరిగిందన్నారు. అయితే ఆ మేరకు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్నారు. ఒకవేళ అవసరానికి సరిపడా విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలు లేదా ప్రైవేటు సంస్థల వద్దనుంచి కొనుగోలు చేసినప్పటికీ దానిని నిరాటంకంగా సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే మాట్లాడుతూ గడచిన అనేక సంవత్సరాలుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో సరఫరా, పంపిణీలకు సంబంధించి మౌలిక వసతులు ఎంతమాత్రం మెరుగుపడలేదన్నారు. మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.
కోతలతో వెతలు
నోయిడా: విద్యుత్ సరఫరాలో కోత కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కోత ఇక్కడ నిత్యకృత్యంగా మారిపోయింది. రోజుకు రెండు పర్యాయాలు మూడుగంటలపాటు సరఫరా లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇందిరాపురం తదితర ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయాయి. దీంతో పలు హౌసింగ్ సొసైటీలు తమ అవసరాలకోసం భూగర్భ జలాలను వాడుకుంటున్నాయి. దీంతో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోయింది.