ఇంకా గాలింపే!
కానరాని ఆచూకీ
గడుస్తున్న రోజులు
పరిశోధక నౌకలతో గాలింపు ముమ్మరం
చెన్నై: అదృశ్యమైన ఏయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ కానరావడం లేదు. రోజులు గడుస్తున్నాయేగానీ, చిన్నపాటి ఆధారం లభించకపోవడంతో గాలింపులో ఉన్న బృందాలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు.
చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది అందులో ఉన్న 29 మంది ఆచూకీ పై ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విమానం గల్లంతై మూడు వారాలు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.
చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి.
జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ పరిశోధక నౌకలు రంగలోకి దిగడంతో ఏదేని ఆచూకీ లభిస్తుందన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఈ నౌకలు పరిశోధనలు చేపట్టి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి చిన్న ఆధారం కూడా కన్పించనట్టు సంకేతాలు వచ్చాయి. సాగర్ నిధి, రత్నాకర్ నౌకల్లో ఉన్న అన్ని టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రంగా పరిశోధనలు రేయింబవళ్లు సాగుతున్నా, ఆ విమానం ఆచూకీ మాత్రం కాన రాలేదు.
సముద్రంలో గల్లంతై ఉండొచ్చని భావిస్తున్న ప్రదేశంలో 20 నాటికల్ మైళ్ల దూరం సాగర్ నిధి, మిగిలిన నాటికన్ మైళ్ల దూరంలో సముద్ర రత్నాకర్ తీవ్రంగా పరిశోధనలతో దూసుకు వెళ్తున్నా, చిన్నపాటి ఆధారం అన్వేషణలో కానరాక పోవడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ అందులో ఉన్న 29 మంది కుటుంబాల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది.