ఆ విమానంలో ఎవరూ బతికే చాన్స్ లేదు!
చెన్నై: బంగాళాఖాతంలో అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎవరూ బతికే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో తెలిపింది. 29మంది ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఈ విమానం గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
గత నెల 22న అదృశ్యమైన ఈ విమానం జాడ గురించి ఇప్పటికీ చిన్నపాటి ఆధారంకానీ, ఆచూకీ కానీ తెలియలేదు. ఈ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి రామ్ రావు భామ్రే సమాధానమిస్తూ.. విమానంలో ప్రయాణిస్తున్న వారెవరూ బతికే అవకాశం లేదని తెలిపారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏఎన్-32 విమానం ఆచూకీ దొరికేవరకు గాలింపు చర్యలను మానుకోవద్దని, అది దుర్ఘటనకు గురైన ప్రదేశాన్ని గుర్తించాలని తంబిదురై కేంద్రాన్ని కోరారు.
విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వైమానిక దళానికి చెందిన వివిధ యుద్ధవిమానాలతోపాటు హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విమానం ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే.
చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఇందులో ఉన్న 29 మంది బతికి బయటపడే అవకాశాలు లేవనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా కేంద్రం కూడా ఇదేవిషయాన్ని వెల్లడించింది.
చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి.