
మళ్లీ విచారణకు విజయ్‌భాస్కర్?
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీగా మారిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని భర్తీ చేసేందుకు మేలో నోటిఫికేషన్ వెలువడింది.
► ఐటీ ఎదుట సతీమణి రమ్య హాజరు
► ఇతరులకు మళ్లీ సమన్లు
ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తదితరులకు ఆదాయ పన్నుశాఖ అధికారులు మరోసారి సమన్లు పంపే సూచనలు కనపడుతున్నాయి. సతీమణి రమ్యకు సైతం సమన్లు జారీచేయడం, గురువారం ఆమె విచారణకు హాజరుకావడం మంత్రిని మరింత ఆందోళనకు గురిచేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీగా మారిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని భర్తీ చేసేందుకు మేలో నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటుకు నోటుతో ధన ప్రవాహం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందిన ఫిర్యాదుల మేరకు గత నెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన స్నేహితులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాలు సహా 32 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.89 కోట్ల మేరకు ఎన్నికలకు ఖర్చు చేసినట్లు విలువైన ఆధారాలు లభించడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదాపడింది.
అంతేగాక మంత్రి ఇంటి నుండి రూ.50 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ అధికారులు సమన్లు జారీచేసి తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఆ తరువాత అనేకసార్లు మంత్రి విచారణకు హాజరుకాగా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని సీఎం ఎడపాడిపై కొందరు వత్తిడిపెంచారు. అయితే ఆనాడు మంత్రికి టీటీవీ దినకరన్ అండగా నిలిచి మంత్రి పదవి కోల్పోకుండా కాపాడారు. అయితే ప్రస్తుతం దినకరన్ జైల్లో ఉండగా మంత్రికి ఆదరణ కరువై కష్టాల్లో పడిపోయారు.
దీనికి తోడు గత రెండువారాలుగా స్థబ్దత పాటించిన ఐటీ అధికారులు అకస్మాత్తుగా మంత్రి సతీమణి రమ్యకు ఈనెల 2వ తేదీన సమన్లు జారీచేసి 3వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె బుధవారం కాకుండా గురువారం హాజరైనారు. చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు ఆమె చేరుకున్నారు. ఐటీ అధికారులు తమ విచారణలో సుమారు 50 ప్రశ్నలను సంధించి రమ్యను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు లె లిసింది. గత నెల 7వ తేదీన ఐటీ తనిఖీలకు గురైన ఎంజీఆర్ సంగీతవర్సిటీ వైస్ చాన్సలర్ గీతాలక్ష్మి, నటుడు శరత్‌కుమార్, మాజీ ఎంపీ చిటలంపాక్కం రాజేంద్రన్‌లను సైతం గతంలో అనేకసార్లు విచారించారు.
శరత్‌కుమార్ సతీమణి, నటి రాధికకు చెందిన రాడాన్ టీవీ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు చేసింది. ఇద్దరినీ తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. మంత్రి సతీమణి రమ్యకు సమన్లు జారీచేయడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక అక్రమాల కేసును ఐటీ అధికారులు మరోసారి ముందుకు తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ఐటీ దాడులతో ముడివడి ఉన్న మంత్రితోపాటూ ఇతరులకు మరోసారి సమన్లు జారీచేసి విచారించనున్నట్లు తెలుస్తోంది.