జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమర యోధుల మధ్య వివాదం సృష్టించడం సరికాదని గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ అన్నారు. వారి పేర్లను దుర్వినియోగం చేయడం తగదని హితవు పలికారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమర యోధుల మధ్య వివాదం సృష్టించడం సరికాదని గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ అన్నారు. వారి పేర్లను దుర్వినియోగం చేయడం తగదని హితవు పలికారు. ఇక్కడి బాల భవన్‌లో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూల మధ్య వివాదం సృష్టించేలా ప్రసంగాలు చేస్తున్నారని పరోక్షంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శించారు. సర్దార్ పటేల్ దేశాన్ని సమైక్య పరచగా, నెహ్రూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారని ప్రశంసించారు.
కనుక వారిద్దరూ దేశానికి తమదైన కానుకలను ఇచ్చారని కొనియాడారు. కనుక వారికి తమదనే ఘనత ఉందని అన్నారు. అలాంటి వారి పేర్లను ఉపయోగించుకుని లాభం కోసం వివాదాన్ని సృష్టించడం తగదని పేర్కొన్నారు. కాగా బలమైన దేశ నిర్మాణంలో భావి తరాలైన పిల్లల పాత్ర మహత్తరమైనదని అన్నారు. పిల్లలకు జ్ఞాన సముపార్జనతో పాటు క్రమశిక్షణలో తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొడగు జిల్లాకు చెందిన రాఘవేంద్ర, బెంగళూరులోని బీటీఎం లేఔట్‌కు చెందిన అభిరామ్‌లకు శౌర్య, మండ్యకు చెందిన మోనికాకు కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆ బిల్లు అవసరం లేదు
మూఢాచారాల నిరోధానికి ప్రభుత్వం తీసుకు రాదల్చిన ముసాయిదా బిల్లుపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి బిల్లు అవసరం లేదన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చెడుల గురించి ఆలోచించే శక్తి ఉందని, కనుక అలాంటి బిల్లు అనవసరమని తెలిపారు. తాము కోరుకున్న దాన్ని పొందే హక్కు ప్రజలకుందని, వద్దనుకునే దాన్ని తిరస్కరించే అధికారమూ ఉందని వివరించారు. కనుక బిల్లు విషయంలో ప్రభుత్వం మరో సారి ఆలోచించాలని ఆయన సూచించారు.