సామాన్యుడి ఆయుధమైన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)పై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబై: సామాన్యుడి ఆయుధమైన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)పై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వరుసగా భవనాలు కుప్పకూలి అనేక మంది ప్రాణాలు కోల్పోయినసంగతి తెల్సిందే. దీంతో అప్రమత్తమైన సర్కార్ అక్రమ, శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై చర్యలకు ఉపక్రమించింది. కానీ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ భవనాల వివరాలు ఆర్టీఐ కింద వెల్లడించొద్దని ఆదేశిస్తూ ఆయా ప్రభుత్వ సంస్థలకు జారీ చేసిన జీవో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఆర్టీఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ చట్టం కింద ప్రభుత్వ భవనాల నిర్మాణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు బయటపడితే, వాటిలోని లొసుగులు బట్టబయలవుతాయని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోపాలు బయటపడితే దాని వెనుకున్న బిల్డర్‌లు, అవినీతి రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. గతంలో బిల్డర్లు నిర్మించిన భవనాల్లో నాణ్యత లోపించడం, భవన ప్రణాళిక సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల సర్కార్ ఈ చర్యకు ఉపక్రమించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడి ఆయుధంగా చెప్పుకునే ఆర్టీఐపై సర్కార్ ఈ విధంగా వ్యవహరించడం అక్రమార్కులకు అండగా నిలుస్తుందనే సంకేతాలె ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని మేధావులు అంటున్నారు.
సెప్టెంబర్ 26న ఆదేశాలు
ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల భవనాల ప్రణాళిక, ఇతర వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించవద్దని పేర్కొంటూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ అన్ని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలు గోప్యంగా ఉంచాలని సదరు జీవోలో పేర్కొన్నారు. సెక్షన్ 19 (8) (సీ), 25 (5) ఆర్టీఐ చట్టం కింద ఉన్న నిబంధనలను వృథా చేస్తున్నారని, ఈ ఏడాది సెప్టెంబర్ 26న జారీ చేసిన జీఓలో గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు, హోటల్‌లు, ఆస్పత్రులు, మాల్‌లు, ఐటీ, వాణిజ్య భవనాలకు సంబంధించి సమాచారం ఇవ్వొద్దని సూచించారు.
ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి
ప్రజలకు సమాచారం అంతా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీఐపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపడం సరికాదని కేంద్ర సమాచార కమిషనర్‌గా పనిచేసిన శైలేష్ గాంధీ అన్నారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవనాల పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బిల్డర్ల మోసాల నుంచి బయటపడే అవకాశముంటుందని అన్నారు.
అనాలోచిత నిర్ణయం
గైక్వాడ్ జారీ చేసిన జీవో ప్రజల హక్కులను హరించేలా ఉందని తెలుపుతూ గవర్నర్ శంకర్ నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బంటియాకు ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గలీ లేఖలు రాశారు. ఎటువంటి కసరత్తు చేయకుండా చట్ట విరుద్ధంగా ఆనాలోచిత నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ముంబై లాంటి నగరంలో 52 శాతం భవనాలకు అక్యుపేషన్ సర్టిఫికెట్‌లు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్రమ బిల్డర్‌లు, అవినీతి రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరేలా ఉందని సదరు లేఖలో పేర్కొన్నారు.
అప్రమత్తమైన టీఎంసీ అధికారులు
ఠాణే: జిల్లాలోని దావా పట్టణంలో పగుళ్లు ఏర్పడిన భవనాన్ని గుర్తించిన ఠాణే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) సిబ్బంది రంగంలోకి దిగి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆరేళ్ల క్రితం నిర్మించిన ఐదు అంతస్తుల విష్ణు కళ భవనానికి పగుళ్లు ఏర్పడి ఎప్పుడైనా కూలిపోవచ్చని అనుమానించిన స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారమందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి అందులో ఉంటున్న 11 దుకాణాలను మూసివేసి, 66 మంది కిరాయిదారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు దివాలోని గణేశ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేయవచ్చని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను సరైన సమయంలో ట్రాన్సిట్ క్యాంపుకు తరలించామన్నారు. ఠాణేలోని కల్వా పట్టణంలో సోమవారం ఓ భవనం కూలిన నేపథ్యంలో టీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో ఉంటున్న నివాసులు ఖాళీ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ భవనం కూలడంతో భారీ ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.