ఇది చతుర్ముఖ దుష్ట పాలన | It is the evil rule of four | Sakshi
Sakshi News home page

ఇది చతుర్ముఖ దుష్ట పాలన

Published Mon, Jan 30 2017 1:17 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ఇది చతుర్ముఖ దుష్ట పాలన - Sakshi

ఇది చతుర్ముఖ దుష్ట పాలన

అవినీతి, అసమర్థ, అసత్య, అప్రజాస్వామిక పాలన నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు)
‘‘రాష్ట్రంలో చతుర్ముఖ దుష్టపరిపాలన జరుగుతోంది. దీనికి చరమగీతం పాడేందుకు మేధావులు, యువకులు కదలిరావాలి. గ్రామస్థాయి నుంచి ప్రతిఒక్కరూ సన్నద్ధం కావాలి’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సాసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, అసమర్థత, అసత్యాలు, అప్రజాస్వామికమనే నాలుగుపాదాల దుష్టపరిపాలన సాగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌ వందలాదిమంది నాయకులు, వేలాదిమంది అనుచరులతో పార్టీలోకి చేరిన సందర్భంగా జరిగిన సభలో జగన్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ, అబద్ధాల, అప్రజాస్వామిక పాలన ఏ విధంగా సాగుతున్నదో సోదాహరణంగా వివరించారు. 

రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, చివరకు గుడిభూములను కూడా వదలడం లేదని జగన్‌ విమర్శించారు. అవినీతికి పాల్పడడం వల్లే సీబీఐ విచారణ జరిపిస్తారని చంద్రబాబు భయపడి కేంద్రానికి ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారని ఎద్దేవాచేశారు. రైతులకిచ్చే రుణాల లక్ష్యాలు చేరుకోకపోయినా బ్యాంకర్లను అడిగే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారన్నారు. రైతుల భూములు ఎలా లాక్కోవాలనేదానిపైనే కేబినెట్‌ సమావేశాలలో చర్చిస్తున్నారు తప్ప రైతులకు మేలు చేద్దామన్న ఆలోచనే చేయడం లేదని జగన్‌ విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే..

అవినీతి పాలనే బాబు ఘనత..
‘‘రాష్ట్రంలో అవినీతి పాలన ఎంత గొప్పగా జరుగుతుందో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) ఈ మధ్యనే నివేదిక ఇచ్చింది. దేశంలో 29 రాష్ట్రాలుంటే మన ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు పాలనలో అవినీతిలో నంబర్‌ 1గా ఉందని చెప్పింది. బాబు పాలన కేవలం వ్యవస్థలను, మనుషులను, మీడియాను మేనేజ్‌ చేయడం.. తద్వారా ప్రజలను గొప్పగా మోసం చేయడం.

► ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సూట్‌కేసులో డబ్బులు పెట్టుకుని పోవడం, కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోవడం, జైలుకు పోకపోవడం ఎక్కడన్నా చూశామా? ఎక్కడా జరగదు. చంద్రబాబుకు మాత్రమే అది సాధ్యం.
► అవినీతి పాలన ఏ లెవల్లో ఉందంటే రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తాడు. అయినా చర్యలుండవు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటే.. రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసీ.. ఇక్కడ కాదు అక్కడెక్కడో రాజధాని వస్తుంది నూజివీడులోనో, నాగార్జునా యూనివర్సిటీ ప్రాంతంలోనో వస్తుందని చెబుతాడు. చంద్రబాబు బినామీలంతా రాజధాని వచ్చే చోట తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేస్తారు. ఓ ఏడెనిమిది నెలల తర్వాత రాజధాని ఇక్కడే వస్తుందని చెప్పి చంద్రబాబు డిక్లేర్‌ చేస్తారు. దాంతో రైతులంతా నష్టపోతారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రం బాగా సంపాదించుకుంటారు.  
► రాజధాని పేరుతో స్విస్‌ చాలెంజ్‌ అని చెప్పి చంద్రబాబు తనకు నచ్చిన సింగపూర్‌ సంస్థలకు వేల ఎకరాల భూములు కేటాయిస్తాడు. రైతుల దగ్గర చౌకగా బలవంతంగా లాక్కుని నచ్చిన సంస్థలకు ఇష్టం వచ్చిన రేట్లకు కమీషన్లు తీసుకుని భూములు కేటాయిస్తాడు.
► ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ఇవాళ నీళ్లు కాదు.. అవినీతి డబ్బు పారుతోంది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రత్యేక జీవోలు (జీవో22) తెస్తాడు. ఈపీసీ కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వాల్సిన పనిలేకపోయినా కమీషన్లు మాట్లాడుకుని నచ్చిన వాళ్లకు రేట్లు పెంచేసి చెక్కులిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచేశాడు. కాంట్రాక్టరు పనిచేయలేకపోతే తీసేసి కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉన్నా ఆ పనిచేయడు. కారణం కొత్త టెండర్లు పిలిస్తే రేట్లు తగ్గించాల్సి వస్తుందన్న భయం. ఈ రెండున్నరేళ్లలో పెట్రోలు, డీజిల్, సిమెంటు, స్టీలు రేట్లు తగ్గాయి. ఇసుక కూడా ఫ్రీగా వస్తోంది. అయినా కాంట్రాక్టులకు కొత్త టెండర్లను పిలవడు. ఎందుకంటే తనకు కమీషన్లు తగ్గిపోతాయన్న భయం. ఒకవైపు పోలవరం అంచనా వ్యయం పెంచుతాడు. మరోవైపున అన్యాయమైన కాంట్రాక్టర్లని తెలిసినా వారిని కొనసాగనిస్తాడు. తనకు నచ్చిన కాంట్రాక్టరను, బినామీలను సబ్‌ కాంట్రాక్టర్లుగా తెస్తాడు. ఇంత దారుణంగా అవినీతి జరుగుతోంది.
► మద్యం షాపుల నుంచి డిస్టిలరీల వరకు అవినీతే. విద్యుత్‌ కొనుగోలు కోసం బొగ్గు కొనుగోలులో అవినీతి. చివరకు గుడి భూములను కూడా వదలిపెట్టలేదు. చెన్నైలోని సదావర్తి భూములను వెయ్యి కోట్లకు పైగా విలువున్న భూములను ముష్టివేసినట్లు రూ. 22 కోట్లకు తన బినామీలకు కట్టబెడతాడు. కనకదుర్గమ్మ గుడి భూములను కూడా వదలిపెట్టలేదు. విజయవాడ నడిబొడ్డున తనకు నచ్చినవాళ్లకు కమీషన్లు తీసుకుని కారుచౌకగా లీజుకు ఇచ్చేస్తున్నాడు.
► రాజధానిలో తాత్కాలిక భవనాలు, తాత్కాలిక సెక్రటేరియట్ల పేరుతో ఖర్చు చేస్తాడు. మనం ఇల్లు కట్టుకోవాలంటే అడుగు రూ.1,500 మించదు. కానీ తాత్కాలిక భవనాలకు అడుగుకు రూ.10,000 ఇస్తున్న చంద్రబాబు కాంట్రాక్టరకు దోచిపెడుతూ కమీషన్లు తీసుకుంటున్నాడు. ఏ వీధిలో చూసినా ఇసుక దొంగలు, వాడవాడలా మట్టి దొంగలు కనిపిస్తారు. ప్రభుత్వ పనులు నామినేషన్‌ పద్ధతిలో అయినవాళ్లు చేసుకునేలా జీవోలు తెస్తున్నాడు.
► గ్రామ స్థాయిలో జన్మభూమి నుంచి దొంగలు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల నుంచి దొంగలు. జిల్లా స్థాయిలో మంత్రుల నుంచి దొంగలు. కేబినెట్‌ స్థాయిలో ఏకంగా ఓ ముఖ్యమంత్రే దొంగతనం చేస్తున్నాడు. కన్సల్టెంట్లంటాడు నామినేషన్‌ పద్ధతిలో ఇష్టం వచ్చిన రీతిలో ఇస్తూ కమీషన్లు గుంజుతాడు. రాజధానికి ఒక్కరోజు భూమిపూజకు రూ.400 కోట్లు ఖర్చు. పుష్కరాలకు 12 రోజులకు రూ.3వేల కోట్లు నామినేషన్‌ పద్ధతిలో పనులు కేటాయించి కమీషన్లు తీసుకున్నాడు. చివరకు దేవుని సొమ్ము అవినీతి చేయకూడదన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. మూడు రోజులపాటు సైన్స్‌ ఫెస్టివల్‌కి రూ.200 కోట్లు ఖర్చు పెడతాడు.
► మామూలు విమానాల్లో చంద్రబాబు ప్రయాణం చేయడు. ప్రైవేటు విమానాల్లోనే సింగపూర్, జపాన్, దుబాయ్, స్విట్జర్లాండ్‌ పోతాడు. ఇక్కడివాళ్లతో లావాదేవీలు చేస్తే దొరికిపోతామని, మోదీ మొట్టికాయలేస్తాడన్న భయం ఉంది. బయట దేశాలకు పోతే ఎవరికీ తెలియకుండా డాలర్లు తీసుకోవచ్చని తెల్లచర్మం, తెల్ల జుట్టు ముద్దంటాడు.

అసమర్థ పాలనకు నిదర్శనాలెన్నో..
► ఈ సంవత్సరం ఖరీఫ్‌కు బ్యాంకర్లందరూ క్రాప్‌లోన్లు రూ.36వేల కోట్లు, టర్మ్‌ రుణాలు రూ.12 వేల కోట్లు మొత్తంగా రూ.48 వేలకోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రూ.28 వేల కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సంవత్సరం రబీ పంట విషయానికొస్తే రూ. 24,640 కోట్లు పంటరుణాలు, రూ.9,800 కోట్లు టర్మ్‌ రుణాలు.. మొత్తంగా రూ. 35 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇచ్చింది కేవలం రూ. 5 వేల కోట్లు.  కనీసం ఆ బ్యాంకర్లను పిలిచి ఎందుకింత దారుణంగా చేస్తున్నారని అడిగే దమ్ము – ధైర్యం చంద్రబాబుకు లేవు.
► రబీలో పంట విస్తీర్ణం రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే.. 13 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయని పరిస్థితి. ఇంత దారుణంగా రైతులు బతుకుతున్నా ఏ రోజూ కూడా చంద్రబాబు కేబినెట్‌ మీటింగుల్లో రైతుల గురించి మాట్లాడడు. ఆలోచన చేయడు. కేబినెట్‌ మీటింగ్‌ జరిగితే చంద్రబాబు ఆలోచించేదేమిటంటే.. రైతుల భూములు ఎలా లాక్కోవాలా అని.
► తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన పరిస్థితుల్లో కేసీఆర్‌ను నిలదీయాల్సి వస్తే బొక్కలో పెడతాడని భయపడి పక్కరాష్ట్రం కృష్ణా, గోదావరి జలాలను అట్నుంచటే పంపులు పెట్టి తీసుకుపోతున్నా అడగలేకపోతున్నాడు. అంతటి అసమర్థ పాలన చూస్తున్నాం.
► సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా అధికార, ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొడుతూ విభజన రోజు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశాయి. ఆ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని అడిగే దమ్ము– ధైర్యం చంద్రబాబుకు లేవు. గట్టిగా మోడీని అడిగితే పైన చెప్పుకున్న అవినీతి వ్యవహారాలపై సీబీఐ చేత విచారణ చేయించి బొక్కలో పెడతాడన్న భయం చంద్రబాబుకు.
► విభజన చట్టంలో మనకు దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ఫ్యాక్టరీ, విశాఖలో రైల్వే జోన్,  గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీప్రాజెక్టు పెడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎంత ఖర్చయినా పూర్తిగా మేమే భరిస్తాం.. పూర్తి చేస్తాం అన్నారు. ఇవేవీ ఇవ్వకపోయినా, మోసం చేస్తున్నా వాళ్లేదో గొప్పగా ఇచ్చినట్లు చంద్రబాబు దానికో కలర్‌ ఇచ్చి ఒక ప్యాకేజీ పేరుపెట్టి ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెడుతున్నాడు. ప్రత్యేకహోదాను ఫణంగా పెడుతున్నాడు.
► ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని నడిరోడ్డులో లాక్కుని వచ్చినా వాళ్లపై చర్య తీసుకోలేడు. ఇదే జిల్లాలో కొద్దిరోజుల క్రితం విద్యార్థిని హత్య జరిగినా, దాని వెనక తెలుగుదేశం ఎమ్మెల్యేలున్నారని పేపర్లలో వస్తున్నా నిందితులపై చర్య తీసుకునే దమ్ము – ధైర్యం చంద్రబాబుకు లేవు.
► ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. 108 నంబర్‌ డయల్‌ చేస్తే కుయ్‌కుయ్‌కుయ్‌మంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చేది. ఎంత పెద్ద ఆపరేషనయినా కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేయించి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి చేర్చేది. ఇవాళ అంబులెన్స్‌ ఎపుడొస్తుందో తెలియదు. ఆసుపత్రుల బకాయిలు 8 నెలల నుంచి ఇవ్వడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. 104 కు ఫోన్‌చేస్తే గ్రామాల్లో వృద్ధులకు మందులు దొరికేవి. షుగర్‌ పరీక్షలు జరిగేవి. ఇవాళ డ్రైవర్లకు జీతాలివ్వలేని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నడిపిన అపర సంజీవని ఆరోగ్యశ్రీని ఇప్పుడు నడపలేని అసమర్థ పాలనను చూస్తున్నాం.
► బీసీలకు ఇస్త్రీ పెట్టెలిచ్చి, కత్తెరలిచ్చి వారిపై ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటాడు. పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలంటే, పేదరికం పోవాలంటే పేదవాని కొడుకు ఇంజనీరో డాక్టరో కావాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి. చదివించడానికి పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పెద్ద చదువైనా నేను చదివిస్తా అని దివంగత నేత వైఎస్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో పేదవాడిని చదివించా డు. ఇవాళ ఇంజనీరింగ్‌ చదవాలంటే ఫీజులు రూ. 80వేలు, లక్ష, లక్షా ఇరవైవేల స్థాయికి పోయాయి. కానీ పిల్లలకు బాబు ముష్టివేసినట్లు రూ.30 వేలు కూడా ఇవ్వడం లేదు. లక్ష ఫీజులో రూ. 30 వేలు పోతే మిగిలిన రూ.70 వేలకు ఇల్లు, పొలం అమ్ముకోవలసిన పరిస్థితి. అలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా నడపలేని అసమర్థ పాలన ఇది.
► రైతులు తమ కాళ్ల మీద నిలబడాలి, రైతులకు నీళ్లందాలి అని దివంగత నేత వైఎస్‌ ప్రాజెక్టులన్నిటిలో 80శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన ఇది.
► మూడేళ్లు కావస్తోంది. ఒక్క గ్రామంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించలేని పాలన ఇది. వైఎస్‌ఆర్‌ సువర్ణయుగంలో దేశమంతా కలిపి 48లక్షల ఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే దేశంతో పోటీపడి 48 లక్షల ఇళ్లు కట్టిన పాలన అది. అలాంటి పాలన ఇవ్వలేని అసమర్థ పాలన ఇది.’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement