‘అమ్మ’ అదృశ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో ఏమూల చూసినా కనిపించే అమ్మ ఫొటోలు క్రమేణా అదృశ్యమవుతున్నాయి. జైలు పాలైన జయలలిత సీఎం పదవిని కోల్పోవడంతో ఆమె ఫొటోలను ఆగమేఘాల మీద తొలగిస్తున్నారు. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు చేతపట్టిన జయలలిత ప్రజల్లో అదే స్థాయి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అన్నాడీఎంకేలోనూ, ప్రభుత్వంలోనూ అమ్మదే ఆధిపత్యం, ఎన్నికల ప్రచార పర్వంలోనూ ఆమెదే ఏకఛత్రాధిపత్యం. అందుకే రాష్ట్రంలోని అనేక పథకాలకు అమ్మ పేరు పెట్టారు. ఇంతటి ప్రజాకర్షణ గల నేత జయకు జైలు శిక్షపడడం అన్నాడీఎంకేకు శరాఘాతంగా మారింది. విధిలేని పరిస్థితిలో పన్నీర్‌సెల్వం సీఎం అయ్యారు. జయ అధికార చాంబర్‌ను అలాగే వదిలి ఆర్థిక మంత్రి చాంబర్‌నే సీఎం చాంబర్‌గా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత పేరుతో వెలిసిన పథకాల బోర్డులు తొలగించక తప్పలేదు.
జయ పోయిస్‌గార్డెన్‌లోని తన ఇంటి నుంచి బీచ్‌రోడ్డు మీదుగా సచివాలయూనికి చేరుకునే మార్గంలో బస్టాపుల్లోని ప్రభుత్వ పథకాల బోర్టులను తొలగించేశారు. వాటి స్థానంలో సాధారణ బోర్డులను పెట్టే పనులు ప్రారంభమయ్యూయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఫొటోలను తీసివేయాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సైతం అమ్మ ఫొటోల స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఫొటోలు వెలిశాయి. అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ ఉప్పు, అమ్మ ఫార్మసీలు ఇప్పటికే చలామణిలో ఉన్నాయి. వాటిని ఎలా నిర్వహిస్తారో వేచిచూడాలి. బస్తా రూ.190కే అందేలా అమ్మ సిమెంట్ పథకాన్ని కోర్టుకు హాజరయ్యే ముందు రోజునే జయ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లోగా వాడుకలోకి తెచ్చేందుకు కార్పొరేషన్ పరిధిలో అమ్మ థియేటర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ థియేటర్లు వస్తాయా లేక పనులు అర్థాంతరంగా నిలిచిపోతాయానేది ప్రశ్నార్థకంగా మారింది.