నదీ జలాలకు శాశ్వత పరిష్కారం!
Published Mon, Mar 31 2014 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించే ప్రభుత్వం కేంద్రం లో ఏర్పాటయితే నదీ జలాల పంపిణీ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. సేతు సముద్రం ప్రాజెక్టుతో తమిళనాడుకు ఒరిగేది శూన్యం అని, జాలర్ల బతుకులు ఆ ప్రాజెక్టుతో ఛిన్నాభిన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ ప్రజల ప్రభుత్వం కేం ద్రంలో ఏర్పడడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులకు మద్దతుగా సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. ఆదివారం రామనాథపురంలో అక్కడి అభ్యర్థి అన్వర్ రాజాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జయలలితకు జనం బ్రహ్మరథం పట్టారు.
నదీ జలాలు: జయలలిత ప్రసంగిస్తూ తమిళ ప్రజలకు ఉపయోగపడని పథకాలను కేంద్రం అమల్లోకి తెచ్చే యత్నం చేసిందని శివాలెత్తారు. నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రోడ్లు, తాగునీరు, మౌళిక వసతుల కల్పనలో తాము ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించారు. ఇక్కడ నిర్లవణీకరణ పథకం అమలుకు ఒప్పందాలు ఆహ్వానించామని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. అన్నాడీఎంకే కీలక భూమిక పోషించే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే, నదీ జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించారు.
ఛిన్నాభిన్నం: సేతు సముద్రం ప్రాజెక్టుతో తమిళులకు ఒరిగేది శూన్యమేనన్నారు. ఆ ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నారో చెప్పాలని తాను పలు వేదికలపై ప్రశ్నలు విసిరానని, ఇందుకు కాంగ్రెస్, డీఎంకే నాయకులు ఎవరూ నోరు మెదపక పోవడం బట్టి చూస్తే, ఆ పథకంతో ప్రజలకు ఉపయోగం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే జల జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, జాలర్ల బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సేతు సముద్రం కోసం తవ్వే కాలువలో పెద్ద నౌకలు పయనించేందుకు వీలు లేదని, అలాంటప్పుడు ఎలా ఎగుమతులు ఈ మార్గంలో సాగుతాయో చెప్పండంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయని, అందువల్లే తాను దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ. 230 కోట్లు ఖర్చు పెట్టి, ప్రజా ధనాన్ని బుగ్గి పాలు చేశారని మండిపడ్డారు.
కోత ల రహిత రాష్ట్రం: రాష్ట్రాన్ని కోతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం తన లక్ష్యంగా పేర్కొన్నారు. డీఎంకే సర్కారు పుణ్యమా రాష్ట్రం అంధకారంలో మునిగిందని గుర్తు చేశారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత తన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయని వివరించారు. అందువల్లే తాత్కాలికంగా విద్యుత్ కోత విధించాల్సి వచ్చిందన్నారు. అయితే, రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేసినట్టు, ఇక, విద్యుత్ కోతల మోత తప్పదన్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను చూడబోతోందని, కోతల రహిత రాష్ట్రంగా తమిళనాడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాబోతోందని ప్రకటించారు.
Advertisement
Advertisement