
అమ్మ ఆస్తులు వందకోట్లపైనే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, మరోసారి సీఎం పీఠం దక్కించుకునేందుకు ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్న ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తన ఆస్తులను రూ.వందకోట్లకు పైగా ప్రకటించారు. స్థిర, చర ఆస్తులు మొత్తం కలిపి రూ.113.73కోట్లుగా ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
మే16న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ పత్రాల్లో ఈ ఆస్తుల వివరాలను జయ ప్రకటించారు. అయితే, గత ఏడాది ఉప ఎన్నిక సందర్భంగా ఆమె ప్రకటించిన ఆస్తుల కన్నా.. రూ.3.4 కోట్ల ఆస్తులు తగ్గాయి.
జయలలిత ఆస్తుల్లో చరాస్తుల విలువ రూ.41.63 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.72.09కోట్లుగా ఉంది. దీంతోపాటు 21,280.300 గ్రాముల బంగారం ఉందని అయితే, అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, కర్ణాటక ట్రెజరీ డిపార్ట్మెంట్ వద్ద ఉందని చెప్పారు. కాగా 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయ తన ఆస్తులు 51.04కోట్లుగా ప్రకటించారు.