
అన్నాకు నివాళి
తమిళనాట ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త అన్నాదురై వర్ధంతిని పురస్కరిం చుకుని మంగళవారం రాష్ర్ట వ్యాప్తం గా ఆయనకు నివాళులర్పించారు.
తమిళనాట ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త అన్నాదురై వర్ధంతిని పురస్కరిం చుకుని మంగళవారం రాష్ర్ట వ్యాప్తం గా ఆయనకు నివాళులర్పించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో, డీఎంకే అధినేత కరుణానిధి మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్ద నివాళులు అర్పించారు. డీఎండీకే, ఎండీఎంకే నేతృత్వంలో అన్నాదురైకి పుష్పాంజలి ఘటించారు.
సాక్షి, చెన్నై: ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త మాజీ సీఎం అన్నాదురై 46వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లో ప్రత్యేకంగా నిర్వహించారు. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేల నేతృత్వంలో అన్నా చిత్ర పటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చెన్నై మెరీనా తీరంలోని సమాధి వద్ద సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే నాయకులు నివాళులు అర్పించారు. పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. డీఎంకే అధినేత కరుణానిధి నేతృత్వంలో చేపాక్కం నుంచి మౌన ప్రదర్శనగా శాంతి ర్యాలీ మెరీనా బీచ్ వరకు సాగింది. కరుణానిధి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్ నేతృత్వంలో నాయకులు, ర్యాలీగా తరలి వచ్చి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఎండీఎంకే నేత వైగో ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్గాలు తీరంలోని సమాధి వద్ద నివాళి అర్పించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకలో నివాళులు అర్పించారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. తిరువాన్మియూరులోని ఓ ఆలయంలో సీఎం పన్నీర్ సెల్వంలో సహపంక్తి భోజనం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రుల నేతృత్వంలో శ్రీరంగం పరిసరాల్లో అన్నాకు నివాళులర్పించి, దేవాలయూల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.