జయలలిత.. ఇద్దరు శశికళలు
చెన్నై: జయలలిత ఆశీస్సులతో ఇద్దరు మహిళల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒకరికి ఏకంగా తన ఇంట్లో స్థానం కల్పించగా, మరొకరిని రాజ్యసభకు పంపారు. ఆ ఇద్దరు మహిళలే శశికళ నటరాజన్, శశికళ పుష్ప. కాగా కారణాలేంటో కానీ ఈ ఇద్దరు శశికళలకు అసలు పడటం లేదు.
శశికళ నటరాజన్‌తో జయలలిత స్నేహం గురించి అందరికి తెలిసిన విషయమే. అన్నా డీఎంకేలో జయ తర్వాత శశికళే అన్నట్టుగా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తమిళనాడులోని తుత్తుకుడి మేయర్‌గా ఎన్నికైన శశికళ పుష్ప.. అమ్మ అనుగ్రహంతో 2014లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జయలలితకు శశికళ పుష్ప వీరవిధేయురాలు. గతంలో పోయెస్ గార్డెన్‌లో ఈమెకు ప్రవేశం ఉండేది. అయితే గత ఆగస్టులో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచి శివను శశికళ పుష్ప చెంపదెబ్బ కొట్టడం, ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో జయలలిత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో రాజ్యసభలో కంటతడి పెట్టిన శశికళ పుష్ప.. జయలలిత పేరును ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. తనకు తమిళనాడులో ప్రాణభయం ఉందని, రక్షిణ కల్పించాల్సిందిగా కోరారు. కొన్ని రోజుల తర్వాత జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక ఈ విషయం మరుగనపడింది.
శశికళ వర్సెస్ శశికళ: ఇద్దరు శశికళలకు వైరం నడుస్తోంది. అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక శశికళ పుష్ప.. శశికళ నటరాజన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జయలలిత పేరు చెప్పి నటరాజన్ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని, అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ శశికళ నటరాజన్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. జయలలితను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని, అమ్మ ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం జయలలితకు హాని తలపెట్టేందుకు శశికళ నటరాజన్ కుట్రపన్నారని మరో బాంబు పేల్చారు. కాగా శశికళ పుష్ప తీవ్రమైన ఆరోపణలు చేసినా శశికళ నటరాజన్ స్పందించలేదు. ఇద్దరు శశికళలకు మంచి జీవితాన్ని ప్రసాదించిన జయలలిత ఇప్పుడు లేరు కానీ వారి మధ్య శత్రుత్వం మాత్రం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేలో శశికళ కుటుంబ సభ్యులు, ఇతర నాయకుల మధ్య నాయకత్వ పోరు జరగనుందని, పార్టీలో చీలిక తప్పదని కొందరు చెబుతున్నారు.