జయలలిత మృతి కేసులో మళ్లీ కదలిక?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉందంటూ రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళా పుష్ప రాసిన లేఖపై కదలిక వచ్చింది. జయలలిత అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ శశికళా పుష్ప కేంద్ర హోం మంత్రికి ఓ లేఖ రాశారు.
దాంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. సీబీఐకి సంబంధించిన వ్యవహారాలు చూసే సిబ్బంది వ్యవహారాల శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెర్సనెల్ అండ్ ట్రైనింగ్)కు ఈ విషయాన్ని అప్పగించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ మణిరాం ఒక మెమొరాండం విడుదల చేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో శశికళా పుష్పకు తెలియజేయాల్సిందిగా కూడా అందులో పేర్కొన్నారు.