శశికళపై జయలలిత వేటు
అన్నాడీఎంకేకు చెందిన రాజ‍్యసభ సభ్యురాలు శశికళా పుష్పపై పార్టీ అధినేత్రి జయలలిత వేటు వేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే.. రాజీనామా చేయడానికి తిరస్కరించిన శశికళ.. నేరుగా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ సమావేశాల్లో పాల్గొనడమే కాక, అక్కడ కన్నీరు కూడా పెట్టారు.
ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను.. అన్నాడీఎంకే ఎంపీ శశికళ చెంపమీద కొట్టిన విషయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే. పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఢిల్లీ ఎయిర్పోర్టులో వ్యవహరించారంటూ శశికళపై జయలలిత మండిపడ్డారు. ఆదివారం నాడు పోయస్ గార్డెన్స్కు వెళ్లి వివరణ ఇచ్చినా ఆమె శాంతించలేదు. పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.