
పురుషుల ధోరణి మారాలి
సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. భద్రతపై భరోసా కలిగించే వాతావర ణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు.
సమాజంలోని మహిళల పట్ల పురుషుల ధోరణి మారాలని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. భద్రతపై భరోసా కలిగించే వాతావర ణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నాడు. మద్రాస్ కేఫ్ సినిమాలో నటించిన ఈ 41 ఏళ్ల నటుడు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో సమాజంపట్ల తన మనోభావాలను పంచుకున్నాడు. ‘మహిళలపట్ల పురుషుల ధోరణిలో మార్పు రావడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. మహిళల విషయంలో ఔదార్యంతో ఉండాలనే విషయాన్ని పిల్లలకు వారి తల్లిదండ్రులు తరచూ తప్పనిసరిగా బోధి స్తూ ఉండాలి. భార్యపట్ల భర్త ఎలా ఉంటాడనే విషయాన్ని పిల్లలు గమనిస్తుంటారు.
దానినే వారు కూడా అనుకరిస్తారు. పిల్లలకు విద్య అనేది ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది. వారి జీవితంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు. దాడులకు పాల్పడేవారి విషయంలో చట్టాలు అత్యంత కటువుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. మహిళల భద్రత అంశంపై మాట్లాడే సమయంలో రాజకీయ నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నాడు. రాజకీయ నాయకులు మాటల ప్రభావం సమాజంపై తప్పనిసరిగా ఉంటుందన్నాడు.
వికీ డొనార్, మద్రాస్ కేఫ్ తదితర సినిమాలను నిర్మించిన జాన్... సమాజంపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని నమ్ముతాడు. మనం తీస్తున్న సినిమాలు మహిళను కేంద్రీకృతంగా చేసి నిర్మించినవా లేక పురుషులను కేంద్రీకృతంగా చేసుకుని తీసినవా అనేది ప్రధానం కాకూడదన్నాడు. ఈ వివక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నాడు. సమాజం అంగీకరించే సినిమాల్నే నిర్మించాలని సూచించాడు. తాను చదువుకునే రోజుల్లో మహిళల భద్రత కోసం పోరాటాలు చేశానని వివరించాడు.