‘వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులు’
చెన్నై: జల్లికట్టుపై ఆందోళన సందర్భంగా పోలీసులు ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మండిపడ్డారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జల్లికట్టు కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు.
మెరీనా బీచ్ లో సోమవారం జరిగిన ఘటనలు బాధించాయని చెప్పారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా పోలీసులు దౌర్జన్యం చేశారని వాపోయారు. పోలీసులే విధ్వంసానికి పాల్పడడం శోచనీయమని, వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులని వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.
మూగజీవాల హక్కులపై తనకు అవగాహన లేదన్నారు. ఎద్దులు కూడా పెంపుడు జంతువులేనని అన్నారు. జల్లికట్టుతో పోల్చుకుంటే ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. జల్లికట్టుపై సీఎం పన్నీరు సెల్వం వ్యవహరించిన తీరు బాగుందని కమల్ ప్రశంసించారు. ఇది జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటం కాదని సంస్కృతి పరిరక్షణకు జరుగుతున్న ప్రజా ఉద్యమం అని వివరించారు.
మనుషులు మధ్య అడ్డుగోడలు అవసరం లేదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ‘సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నాం. వీటిని కూలగొట్టాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్ ను ద్వేషించను. ఒకవేళ నేను 1924లో పుట్టివుంటే మహాత్మ గాంధీ ముందు కూర్చుని భారత్, పాకిస్థాన్ కలిసికట్టుగా ఉండాలని అడిగేవాడిని. దేనిపైనా నిషేధం విధించడం సరికాదు. నియంత్రణ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు.