
మరోసారి లాఠీ పట్టనున్న కమల్
విశ్వనాయకుడు కమలహాసన్ మరోసారి లాఠీ చేతపట్టడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే ఈ నట విశ్వరూపుడు యాక్షన్‌కథా చిత్రాలు చేసి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. ఉన్నై పోల్ ఒరువన్, విశ్వరూపం, విశ్వరూపం-2, పాపనాశం, ఉత్తమ విలన్ అంటూ విభిన్న కథా చిత్రాలను చేస్తూ వచ్చిన కమల్ ఈసారి పక్కా యాక్షన్ కథా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పోలీసు అధికారిగా నటించనున్నారట.
నూతన దర్శకుడు రాజేష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కమల్ సరసన సంచలన నటి త్రిష నటించనున్నారు. మన్మథ అన్భు చిత్రం తరువాత కమలహాసన్‌తో ఆమె రొమాన్స్ చేయనున్న రెండవ చిత్రం ఇది. ముఖ్యపాత్రలో ప్రకాష్‌రాజ్ నటించనున్నారు. అలాగే ఇంతకుముందు కమల్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వేట్టైయాడు విళైయాడు చిత్రంలో పోలీసు అధికారిగా నటించారు. ఆ తరువాత ఇన్నాళ్లకు మళ్లీ లాఠీ చేతపట్టనున్న చిత్రం ఇదే అవుతుంది. కమల్ నటించిన ఉత్తమ విలన్ శుక్రవారం తెరపైకి వచ్చింది. పాపనాశం జూన్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆ తరువాత విశ్వరూపం-2 చిత్రం తెరపైకి రావలసి ఉంది.